
ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపాకు ఐసీసీ అక్షింతలు వేసింది. సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డే సందర్భంగా అభ్యంతరకర భాష వాడినందుకు ఓ డీమెరిట్ పాయింట్ అతని ఖాతాలో చేర్చింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఇది లెవెల్-1 ఉల్లంఘన కిందికి వస్తుంది. సాధారణంగా ఇలాంటి తప్పిదాలకు ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లతో పాటు 50 శాతం వరకు మ్యాచ్ ఫీజ్‌లో కోత విధిస్తారు. అయితే గడిచిన 24 నెలల్లో జంపాకు ఇది మొదటి తప్పిదం కావడంతో కేవలం ఓ డీమెరిట్ పాయింట్‌తో సరిపెట్టారు.
ఏం జరిగిందంటే..?
సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 37వ ఓవర్ సందర్భంగా జంపా అభ్యంతరకర భాష వాడాడు. మిస్ ఫీల్డ్‌తో పాటు ఓవర్ త్రో చేయడంతో జంపా సహనం కోల్పోయి ఇలా ప్రవర్తించాడు. జంపా వాడిన భాష స్టంప్ మైక్‌ల్లో రికార్డైంది. దీని ఆధారంగా జంపాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఈ శిక్షను స్వీకరించడంతో జంపాను తదుపరి విచారణ నుంచి మినహాయించారు.
కాగా, సౌతాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆస్ట్రేలియా 40.5 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ఐదు వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాశించాడు. అతనికి నండ్రే బర్గర్ (2/54), లుంగి ఎంగిడి (2/28), సుబ్రాయన్ (1/46) తోడయ్యారు.
ఆసీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మిచెల్ మార్ష్ (88) ఒక్కడే రాణించాడు. ట్రవిస్ హెడ్ (27), బెన్ డ్వార్షుయిస్ (33) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అంతకుముందు మార్క్రమ్ (82), బవుమా (65), బ్రీట్జ్కే (57) అర్ద సెంచరీలతో రాణించడంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో హెడ్ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో ఆడమ్ జంపా (10-0-58-1) పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో రెండో వన్డే ఆగస్ట్ 22న జరుగనుంది.