
తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించి జోష్‌లో ఉన్న సౌతాఫ్రికాకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు అరంగేట్రం స్పిన్నర్ ప్రేనేలన్ సుబ్రాయెన్ (Prenelan Subrayen) బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సుబ్రాయెన్ బౌలింగ్ శైలిపై మ్యాచ్ అఫీషియల్స్ ఐసీసీకి ఫిర్యాదు చేశారు.
కుడి చేతి వాటం రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయిన సుబ్రాయెన్ బౌలింగ్ శైలి కాస్త భిన్నంగా ఉంది. అతడి యాక్షన్ ఐసీసీ నియమాలకు విరుద్దమేమో అని మ్యాచ్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో సుబ్రాయెన్ ఐసీసీ పర్యవేక్షణలో ఓ పరీక్షను (బౌలింగ్ శైలి) ఎదుర్కోవాల్సి ఉంది.
సుబ్రాయెన్ ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పర్వాలేదనిపించాడు. తన కోటా 10 ఓవర్లలో 46 పరుగులిచ్చి అత్యంత కీలకమైన ట్రవిస్ హెడ్ వికెట్ తీశాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆసీస్‌ను 98 పరుగుల తేడాతో చిత్తు చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆస్ట్రేలియా 40.5 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ఐదు వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాశించాడు. అతనికి నండ్రే బర్గర్ (2/54), లుంగి ఎంగిడి (2/28), సుబ్రాయెన్ (1/46) తోడయ్యారు.
ఆసీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మిచెల్ మార్ష్ (88) ఒక్కడే రాణించాడు. ట్రవిస్ హెడ్ (27), బెన్ డ్వార్షుయిస్ (33) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అంతకుముందు మార్క్రమ్ (82), బవుమా (65), బ్రీట్జ్కే (57) అర్ద సెంచరీలతో రాణించడంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో హెడ్ 4 వికెట్లతో సత్తా చాటాడు.
గత నెలలోనే టెస్ట్ అరంగేట్రం
31 ఏళ్ల సుబ్రాయెన్ గత నెలలోనే టెస్ట్ అరంగేట్రం చేశాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు (ఒకే ఇన్నింగ్స్‌లో) తీసి పర్వాలేదనిపించాడు. సుబ్రాయెన్ లోయర్ ఆర్డర్‌లో ఉపయోగకరమైన బ్యాటర్ కూడా. అతడికి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మంచి బ్యాటింగ్ రికార్డు ఉంది.
లేట్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సుబ్రాయెన్ రెండో మ్యాచ్‌తోనే వివాదంలో చిక్కుకున్నాడు. బౌలింగ్ శైలిపై ఐసీసీ క్లీన్ చిట్ ఇస్తేనే అతడు ఆసీస్‌తో రెండో వన్డే ఆడగలడు. రెండో వన్డే ఆగస్ట్ 22న జరుగనుంది.