వన్డే క్రికెట్‌లో సరికొత్త సంచలనం.. రికార్డు స్కోర్లతో దూసుకుపోతున్న సౌతాఫ్రికా బ్యాటర్‌ | AUS VS SA 1st ODI: Matthew Breetzke Rewrites South Africa's History With An Epic All Time Record | Sakshi
Sakshi News home page

వన్డే క్రికెట్‌లో సరికొత్త సంచలనం.. 3 మ్యాచ్‌ల్లోనే చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా బ్యాటర్‌

Aug 19 2025 6:03 PM | Updated on Aug 19 2025 7:26 PM

AUS VS SA 1st ODI: Matthew Breetzke Rewrites South Africa's History With An Epic All Time Record

వన్డే క్రికెట్‌కు సరికొత్త స్టార్‌ పరిచమయ్యాడు. అతడి పేరు మాథ్యూ బ్రీట్జ్కే (26). సౌతాఫ్రికాకు చెందిన ఈ కుడి చేతి వాటం వికెట్‌కీపర్‌ బ్యాటర్‌.. తన తొలి మూడు మ్యాచ్‌ల్లో అదిరిపోయే ప్రదర్శనలు చేసి ఆల్‌టైమ్‌ రికార్డు సెట్‌ చేశాడు. అరంగేట్రం వన్డేలో న్యూజిలాండ్‌పై భారీ సెంచరీ (148 బంతుల్లో 150) చేసిన  బ్రీట్జ్కే.. ఆతర్వాత వరుసగా రెండు వన్డేల్లో (పాకిస్తాన్‌, తాజాగా ఆస్ట్రేలియాపై) హాఫ్‌ సెంచరీలు (83, 57) బాదాడు. 

తద్వారా వన్డే క్రికెట్‌లో తొలి మూడు మ్యాచ్‌ల తర్వాత అత్యధిక స్కోర్‌ (290 పరుగులు) చేసిన బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్‌ మాజీ ఓపెనర్‌ నిక్‌ నైట్‌ పేరిట ఉండేది. నైట్‌ తన తొలి మూడు వన్డేల్లో 264 పరుగులు చేశాడు. ఈ విభాగంలో నైట్‌ తర్వాత స్థానంలో సౌతాఫ్రికాకే చెందిన టెంబా బవుమా (259) ఉన్నాడు.

తొలి మూడు వన్డేల్లో 50కి పైగా స్కోర్లు చేయడంతో బ్రీట్జ్కే మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. నవ్‌జోత్‌ సింగ్‌ సిద్దూ, మ్యాక్స్‌ ఓడౌడ్‌ తర్వాత చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.

బ్రీట్జ్కే ఇవాళ (ఆగస్ట్‌ 19) ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో 56 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 57 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను 98 పరుగుల తేడాతో చిత్తు చేసింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా..  బ్రీట్జ్కేతో పాటు మార్క్రమ్‌ (82), బవుమా (65) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. రికెల్టన్‌ (33), ముల్దర్‌ (31 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో ట్రవిస్‌ హెడ్‌ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఓ రనౌట్‌ కూడా చేశాడు.

అనంతరం 297 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌.. కేశవ్‌ మహారాజ్‌ (10-1-33-5) ధాటికి 40.5 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ (88) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. హెడ్‌ (27), డ్వార్షుయిస్‌ (33) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. 

సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్‌ మహారాజ్‌ ఐదేయగా.. నండ్రే బర్గర్‌, లుంగి ఎంగిడి తలో 2, సుబ్రాయన్‌ ఓ వికెట్‌ తీశారు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే ఆగస్ట్‌ 22న జరుగనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement