
బకూ (అజర్‌బైజాన్): ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. గురువారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్–దివ్య థడిగోల్ సుబ్బరాజు (భారత్) ద్వయం విజేతగా నిలిచింది. స్వర్ణ–రజత పతక ఫైనల్ పోరులో సరబ్‌జోత్–దివ్య జోడీ 16–14తో జొరానా అరునోవిచ్–దామిర్ మికెచ్ (సెర్బియా) ద్వయంపై విజయం సాధించింది.
సరబ్‌జోత్ కెరీర్‌లో ఇది రెండో ప్రపంచకప్ స్వర్ణంకాగా... బెంగళూరుకు చెందిన దివ్యకు ప్రపంచకప్ టోర్నీలలో తొలి పతకం కావడం విశేషం. మొత్తం 55 జోడీలు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో సరబ్‌జోత్–దివ్య ద్వయం 581 పాయింట్లు స్కోరు చేసి టాప్ ర్యాంక్‌లో నిలిచి స్వర్ణ–రజత పతక మ్యాచ్‌కు అర్హత సాధించింది.
భారత్‌కే చెందిన ఇషా సింగ్–వరుణ్ తోమర్ జంట 578 పాయింట్లు స్కోరు చేసి ఆరో ర్యాంక్‌లో నిలిచి పతక మ్యాచ్‌లకు అర్హత పొందడంలో విఫలమైంది. టాప్–4లో నిలిచిన జోడీలు పతక మ్యాచ్‌లకు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో భారత్ ఒక స్వర్ణం, ఒక కాంస్యంతో రెండు పతకాలతో రెండో స్థానంలో ఉంది.