
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ డియాగో జోటాకు టీమిండియా క్రికెటర్ కుల్దీప్ యాదవ్ నివాళి అర్పించాడు. జోటా మరణంతో ఫుట్‌బాల్ ప్రపంచం మొత్తం మూగబోయిందని.. అతడు లేని లోటు ఎవరూ పూడ్చలేరంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.
నా హృదయం ముక్కలైంది
ఈ మేరకు.. ‘‘2020 (లివర్‌పూల్)లో ఒప్పందం.. 20వ నంబర్‌ను సాధించావు.. అదే నీ శాశ్వత గుర్తింపుగా మార్చుకున్నావు. ఈరోజు ఫుట్‌బాల్ ఒక్కటే నిన్ను కోల్పోలేదు.
ప్రపంచం మొత్తం చీకటిగా మారింది. పిచ్‌పై అడుగుపెట్టేటపుడు నీ చిరునవ్వే ఉజ్వలమైన కాంతిలా అనిపించేది. పోర్టో లేదంటే వోల్వ్స్.. లేదంటే లివర్‌పూల్.. ఎక్కడ ఉన్నా నువ్వు అందరి హృదయాలను గెలుచుకున్నావు.
నీ కుటుంబానికి ఆ దేవుడు ధైర్యం అందించాలి. నీ ఆత్మకు శాంతి చేకూరాలి డియాగో’’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో కుల్దీప్ యాదవ్ భావోద్వేగపూరిత నోట్ రాశాడు. హార్ట్‌బ్రేక్ ఎమోజీతో తన అభిమాన ఆటగాడికి నివాళి అర్పించాడు.
కారు ప్రమాదంలో..
కాగా పోర్చుగల్ ఫుట్‌బాల్ జట్టు ఫార్వర్డ్ ప్లేయర్ డియాగో జోటా రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన విషయం విదితమే. స్పెయిన్‌లో జరిగిన కారు ప్రమాదంలో 28 ఏళ్ల డియాగో జోటాతో పాటు అతడి సోదరుడు ఆండ్రె సిల్వా (25) దుర్మరణం పాలయ్యాడు. జమోరా నగరంలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో ఇతర వాహనాల ప్రమేయం లేదని... అతి వేగంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు.

ఈ బంధం శాశ్వతం
అయితే ఘటన జరిగిన సమయంలో కారు ఎవరు నడుపుతున్నారనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. జోటా ఇటీవలే తన ప్రియురాలు రూట్ కార్డోసోను వివాహమాడాడు. ‘ఈ బంధం శాశ్వతం’ అని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించిన వారాల్లోనే అనుకోని ప్రమాదంలో జొటా కన్నుమూశాడు. వీరికి ముగ్గురు సంతానం.
గత నెలలో పోర్చుగల్ జాతీయ జట్టు నేషన్స్ లీగ్ టైటిల్ సాధించడంలో జోటా కీలక పాత్ర పోషించాడు. మరోవైపు ఆండ్రె సిల్వా పోర్చుగల్ క్లబ్ పినాఫైల్ తరఫున పలు డివిజన్ లీగ్‌లలో పాల్గొన్నాడు. ‘ఈ విషాదం తీవ్రంగా బాధిస్తోంది’ అని లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్ ప్రకటించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో జోటా, ఆండ్రె కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడించింది.
లివర్‌పూల్ ప్రధాన ఆయుధం
ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్ లివర్‌పూల్ తరఫున 123 మ్యాచ్‌లాడిన జోటా 47 గోల్స్ సాధించాడు. లెఫ్ట్ వింగ్‌లో ఫార్వర్డ్‌గా ఆడే డియాగో జోటా... అద్వితీయమైన ఫినిషింగ్, ప్రత్యర్థికి అంతుచిక్కని డ్రిబ్లింగ్‌లో సిద్ధహస్తుడు. చిన్నప్పటి నుంచి ఆటను ప్రేమించిన జోటా... జూనియర్ స్థాయిలో సంచలనాలతో వెలుగులోకి వచ్చాడు.
లా లీగాలో అట్లెటికో మాడ్రిడ్ తరఫున 2016 నుంచి రెండు సీజన్‌లు ఆడిన జోటా... ఆ తర్వాత వివిధ క్లబ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 2020 నుంచి లివర్‌పూల్ తరఫున కొనసాగుతున్న జొటా... మూడు మేజర్ ట్రోఫీలు గెలుచుకున్నాడు. గత సీజన్‌లో ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలిచిన జట్టులో డియాగో ప్రధాన సభ్యుడు. ఇక 2019లో పోర్చుగల్ జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన జోటా... కెరీర్‌లో 49 మ్యాచ్‌లాడి 14 గోల్స్ చేశాడు.
ఇది తీరని లోటు...
పోర్చుగల్ సాకర్ సమాఖ్య కూడా జోటా మృతికి సంతాపం తెలిపింది. ‘ఇది పూడ్చలేని లోటు. జాతీయ జట్టు తరఫున 50కి పైగా మ్యాచ్‌లు ఆడిన అద్భుత ఆటగాడు ఇలా అర్ధాంతరంగా మృతిచెందడం కలచివేస్తోంది. సహచరులు, ప్రత్యర్థులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవించే అత్యుత్తమ ఆటగాడు అప్పుడే లోకం వీడి వెల్లడం బాధగా ఉంది’ అని ఒక ప్రకటనలో తెలిపింది.
జోటా మృతికి సంతాపంగా... గురువారం పోర్చుగల్, స్పెయిన్ మహిళల జట్ల మధ్య యూరోపియన్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లు ఒక నిమిషం పాటు మౌనం వహించారు. పోర్చుగల్ ప్రధానమంత్రి లూయిస్ మోంటెనెగ్రో కూడా డియాగో జోటా మృతికి సంతాపం ప్రకటించారు.
‘మేము ఇద్దరు చాంపియన్లను కోల్పోయాము. వారి లోటు పోర్చుగల్ సాకర్‌కు తీరని లోటు. వారి వారసత్వాన్ని గౌరవించేందుకు మా వంతు కృషి చేస్తాం. దేశ ఖ్యాతిని పెంచిన ఆటగాళ్లో జోటా ఒకడు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ఇది సాకర్‌కు విషాదకరమైన రోజు’ అని పేర్కొన్నారు.
ఇక సహచర ఆటగాడు పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో... ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ‘ఇప్పటి వరకు జాతీయ జట్టులో డియాగోతో కలిసి ఆడాను. ఇంతలో ఇలా ఎలా జరిగిందో. ఇటీవలే జోటా వివాహం జరిగింది. కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతాడు అనుకుంటే ఊహించని ఘటన అతడిని దూరం చేసింది. ఈ క్లిష్ట సమయంలో అతడి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. మేమందరం మిమ్మల్ని మిస్ అవుతాము’ అని రొనాల్డో అన్నాడు.
మరోవైపు.. బాస్కెట్‌బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్‌తో పాటు టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ వంటి పలు ప్లేయర్లతో పాటు... ఇతర క్లబ్‌లు, పలువురు ప్రముఖులు కూడా సంతాపం ప్రకటించారు. టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా జోటా మృతికి సంతాపం తెలిపాడు. కాగా కుల్దీప్ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాడు. అయితే, తొలి రెండు టెస్టుల్లోనూ అతడికి తుదిజట్టులో ఆడే అవకాశం లభించలేదు.
చదవండి: వింబుల్డన్‌లో సంచలనాల మోత.. టాప్ సీడ్‌లకు ఊహించని షాకులు