అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న తొలి వన్డేతో టీమిండియా తరఫున గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేలు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. హర్ష్‌దూబేకు కేఎల్ రాహుల్ డెబ్యూ క్యాప్ అందించగా, గుర్నూర్ బ్రార్‌కు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ క్యాప్ అందించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఈ ఇద్దరు క్రికెటర్లపై ఒక లుక్కేద్దాం. వీరిద్దరు అరంగేట్రం చేసినప్పటికీ గుర్నూర్ ఎంపిక వెనుక మాత్రం కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కీలకపాత్ర పోషించాడు.
గిల్ మెచ్చిన క్రికెటర్..
పంజాబ్‌కు చెందిన గుర్నూర్ బ్రార్‌కు సౌతాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ ఆరాధ్య క్రికెటర్. అతడి బౌలింగ్ యాక్షన్‌ను అచ్చుగుద్దినట్లు అనుకరించడంలో గుర్నూర్ బ్రార్ సుప్రసిద్ధుడు. అయితే గుర్నూర్ చిన్న వయసులో క్రికెట్ కంటే ఫుట్‌బాల్, టెన్నిస్ ఆటను ఎక్కువగా ఇష్టపడేవాడు. అయితే హైట్ అడ్వాంటేజ్ కారణంగా క్రికెట్‌లోకి వెళితే బాగా రాణిస్తావు అని స్నేహితులు ఇచ్చిన సలహాతో గుర్నూర్ బ్రార్ తననుత తాను పరీక్షించుకోవడానికి క్రికెట్ ట్రయల్స్‌కు వెళ్లాడు.
ఆ తర్వాత రెండేళ్లలోనే ఇండియా అండర్-19 టీమ్‌కు బౌలింగ్ చేసే స్థాయికి వెళ్లాడు. అక్కడే గుర్నూర్ బ్రార్‌కు ప్రస్తుత టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పరిచయమయ్యాడు. అతడి టాలెంట్‌ను గమనించిన గిల్ కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చాడు. అలా పంజాబ్ అండర్-23 జట్టులో చోటు దక్కించుకున్న గుర్నూర్ బ్రార్ 2021లో లిస్ట్-ఏతో పాటు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 2023లో పంజాబ్ కింగ్స్‌కు నెట్‌బౌలర్‌గా వచ్చిన గుర్నూర్ బ్రార్‌కు అనుకోకుండా జట్టుకు ఆడే అవకాశం వచ్చింది.
అప్పటి పంజాబ్ కింగ్స్ జట్టులో శిఖర్ ధావన్ గాయంతో టోర్నీకి దూరమవ్వడంతో అతడి స్థానంలో ఎంపికయిన గుర్నూర్ బ్రార్ లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత గిల్ మరోసారి గుర్నూర్‌కు అండగా నిలబడి నెట్‌బౌలర్‌గా తీసుకోవాలని గుజరాత్ టైటాన్స్‌కు సూచించాడు. ఈ సమయంలోనే హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, స్టార్ బౌలర్ రబాడ ఇచ్చిన సలహాలు గుర్నూర్‌కు చాలా ఉపయోగపడ్డాయి.
అలా ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు జరిగిన వేలంలో గుర్నూర్ బ్రార్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.30 లక్షలకు రిటైన్ చేసుకుంది. అయితే ఐపీఎల్ అంత మంచి ప్రదర్శన చేయనప్పటికీ విజయ్ హజారే ట్రోఫీలో సెమీస్‌లో అతడి ప్రదర్శన గుర్తింపు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో సెలెక్టర్ల దృష్టిలో పడిన గుర్నూర్ బ్రార్‌ను గతేడాది ఇండియా-ఏ జట్టుకు ఎంపిక చేయడంతో అతడి కెరీర్ మలుపు తిరిగింది.
నిఖార్సైన ఆల్‌రౌండర్
విదర్భకు చెందిన హర్ష్ దూబే నిఖార్సైన ఆల్‌రౌండర్, 2024-25 రంజీ సీజన్‌లో విదర్భ టైటిల్ గెలవడంలో హర్ష్ దూబేది కీలకపాత్ర. ఆ సీజన్‌లో హర్ష్‌దూబే మొత్తం 69 వికెట్లు పడగొట్టాడు. అతడి ప్రదర్శనకు మెచ్చిన బీసీసీఐ తర్వాతి ఏడాది ఇండియా-ఏ జట్టులోకి ఎంపిక చేసింది. రంజీ ట్రోఫీలో ప్రదర్శనకు గానూ హర్ష్‌దూబే బెస్ట్ ఆల్‌రౌండర్ (లాలా అమర్‌నాథ్) అవార్డు గెలుచుకున్నాడు.
ఇక విజయ్ హజారే ట్రోఫీలో కెప్టెన్‌గా విదర్భను నడిపించిన హర్ష్‌దూబే ఆ జట్టుకు తొలి టైటిల్ అందించాడు. దేశవాలీ క్రికెట్‌లో ప్రదర్శనతో హర్ష్ దూబేను ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు ఎస్ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన హర్ష్‌దూబే ఆ సీజన్‌లో మూడు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీశాడు. 2026 సీజన్‌కు ఎస్ఆర్‌హెచ్ అతడిని రిటైన్ చేసుకుంది.ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లాడిన హర్ష్‌దూబే 8 వికెట్లు తీశాడు.
నిజానికి ఆఫ్గన్‌తో జరిగిన ఏకైక టెస్టు ద్వారానే హర్ష్‌దూబే అరంగేట్రం చేయాల్సింది. రవీంద్ర జడేజాకు విశ్రాంతి కల్పించడంతో మానవ్ సుతార్, హర్ష్‌దూబే పేర్లు వినిపించినప్పటికీ మానవ్ సుతార్‌ను తుదిజట్టులోకి ఎంపిక చేసింది. ఆడిన తొలి మ్యాచ్‌లోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచిన మానవ్ సుతార్ అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు.
𝗗𝗿𝗲𝗮𝗺 𝗰𝗼𝗺𝗲 𝘁𝗿𝘂𝗲 🧢🇮🇳
Congratulations to Harsh Dubey and Gurnoor Brar on receiving their ODI debut caps from KL Rahul and Shubman Gill respectively 👏
Updates ▶️ https://t.co/lCuohEZYAl #TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/GoZSxHSHVf— BCCI (@BCCI) June 13, 2026


