ఏమిటీ ‘అబ్‌స్ట్రక్టింగ్‌ ది ఫీల్డ్‌’.. ఎంతమంది ఔటయ్యారంటే? | What Is Obstructing The field-List of Batters Given Out-IPL history | Sakshi
Sakshi News home page

ఏమిటీ ‘అబ్‌స్ట్రక్టింగ్‌ ది ఫీల్డ్‌’.. ఎంతమంది ఔటయ్యారంటే?

Apr 27 2026 7:21 PM | Updated on Apr 27 2026 8:01 PM

What Is Obstructing The field-List of Batters Given Out-IPL history

క్రికెట్ చ‌రిత్ర‌లో ‘అబ్‌స్ట్ర‌క్టింగ్ ది ఫీల్డ్’ అనేది చాలా పాత రూల్‌. ఈ నిబంధ‌న ఎప్ప‌టి నుంచో అమ‌ల్లో ఉంది. తాజాగా ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో కేకేఆర్‌, ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ మ‌ధ్య మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాట‌ర్ అంగ్‌క్రిష్ ర‌ఘువంశీ అబ్‌స్ట్ర‌క్టింగ్ ది ఫీల్డ్ కింద ఔట్ కావ‌డంతో ఈ అంశం మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది.  మ‌రి అబ్‌స్ట్ర‌క్టింగ్ ది ఫీల్డ్ అంటే ఏమిటీ? అంత‌ర్జాతీయ క్రికెట్‌లో దీనికున్న రూల్ ఏంటి? ఇప్ప‌టివ‌ర‌కు ఎంత‌మంది క్రికెట‌ర్లు అబ్‌స్ట్ర‌క్టింగ్ ది ఫీల్డ్ కింద ఔట‌య్యార‌నేది ఇప్పుడు తెలుసుకుందాం.

అబ్‌స్ట్ర‌క్టింగ్ ది ఫీల్డ్ అంటే?
క్రికెట్ చ‌ట్టాల‌ను రూపొందించే ఎంసీసీ చ‌ట్టాల్లో అబ్‌స్ట్రాకింగ్‌ ది ఫీల్డ్ అనే నిబంధ‌న ఉంది. 37.2 నిబంధ‌న ప్ర‌కారం ఓ బ్యాట‌ర్ ఉద్దేశ‌పూర్వంగా త‌న వికెట్ కాపాడుకోవ‌డానికి బంతిని చేతితో అడ్డుకున్న‌ట్ల‌యితే దాన్ని అబ్‌స్ట్రాకింగ్‌ ది ఫీల్డ్ గా కింద ప‌రిగ‌ణిస్తూ బ్యాట‌ర్‌ను ఔట్‌గా ప్ర‌క‌టిస్తారు. 

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇలా 11 మంది ఆట‌గాళ్లు ఔట్ అయ్యారు. ఈ జాబితాలో ముష్ఫీకర్‌ రహీం 11వ ఆట‌గాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. టెస్టు క్రికెట్‌లో మాత్రం ఇద్ద‌రే ఇలా పెవిలియ‌న్‌కు చేరుకున్నారు. వీరిలో ర‌హీం రెండ‌వ ఆట‌గాడు కాగా.. 1951లో ఇంగ్లాండ్‌కు చెందిన లియోనార్డ్ హ‌ట‌న్ మొద‌టి ప్లేయ‌ర్‌. భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క ఆట‌గాడు అబ్‌స్ట్రాకింగ్‌ ది ఫీల్డ్ కింద ఔట్ అయ్యాడు. ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో మొహింద‌ర్ అమ‌ర్‌నాథ్ ఇలా ఔట్ అయ్యాడు.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అబ్‌స్ట్ర‌క్టింగ్ ది ఫీల్డ్ గా ఔటైన ఆట‌గాళ్లు..
రస్సెల్ ఎండీన్, ఆండ్రూ హిల్డిచ్, మొహ్సిన్ ఖాన్, డెస్మండ్ హేన్స్, మొహిందర్ అమర్‌నాథ్, గ్రాహం గూచ్, డారిల్ కల్లినన్, స్టీవ్ వా, మైఖేల్ వాఘన్, చము చిభాభా, ముష్ఫికర్ రహీమ్.

ఐపీఎల్‌లో నాలుగుసార్లు..
ఇక ఐపీఎల్ విష‌యానికొస్తే ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన 19 సీజ‌న్ల‌లో న‌లుగురు ఆట‌గాళ్లు అబ్‌స్ట్ర‌క్టింగ్ ది ఫీల్డ్ కింద ఔట‌య్యారు. ఈ జాబితాలో యూస‌ఫ్ ప‌ఠాన్‌, అమిత్ మిశ్రా, ర‌వీంద్ర జ‌డేజా ఉండ‌గా.. తాజాగా అంగ్‌క్రిష్ ర‌ఘువంశీ చేరాడు.

యూస‌ఫ్ ప‌ఠాన్‌


ఐపీఎల్‌లో అబ్‌స్ట్ర‌క్టింగ్ ది ఫీల్డ్ కింద వెనుదిరిగిన తొలి ఆట‌గాడిగా ఆల్‌రౌండ‌ర్ యూస‌ఫ్ ప‌ఠాన్ నిలిచాడు. 2013 సీజ‌న్‌లో రైజింగ్ పుణే వారియ‌ర్స్‌తో కేకేఆర్ త‌ల‌ప‌డింది. కేకేఆర్ ఇన్నింగ్స్ స‌మ‌యంలో 72 ప‌రుగుల‌తో ఆడుతున్న యూస‌ఫ్ ప‌ఠాన్ బౌల‌ర్ స్ట్రైకింగ్ ఎండ్‌వైపు విసిరిన బంతికి అడ్డువ‌చ్చాడు. దీంతో ఉద్దేశ‌పూర్వ‌కంగానే బంతికి అడ్డువ‌చ్చిన‌ట్లు పుణే ఆట‌గాళ్లు అప్పీల్ చేయ‌డంతో అంపైర్ ఔటిచ్చాడు.

అమిత్ మిశ్రా


2019 సీజ‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అమిత్ షా ఎస్ఆర్‌హెచ్‌తో ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో అబ్‌స్ట్ర‌క్టింగ్ ది ఫీల్డ్ కింద వెనుదిరిగాడు. బౌల‌ర్ వేసిన బంతిని ఎడ్జ్ తీసుకొని సింగిల్ కోసం పిచ్ మ‌ధ్య‌లో ప‌రిగెత్తాడు. అయితే బంతిని తీసుకున్న కీప‌ర్ నాన్‌స్ట్రైక్ ఎండ్ వికెట్ల వైపు విసిరాడు.కానీ అమిత్ మిశ్రా బంతికి అడ్డంగా వెళ్ల‌డంతో అంపైర్ ఔట్ ఇవ్వ‌క త‌ప్ప‌లేదు.

ర‌వీంద్ర జ‌డేజా
2024 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా  సీఎస్‌కే  బ్యాట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా రెండో ప‌రుగు కోసం ప్ర‌య‌త్నించాడు. అయితే స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాట‌ర్‌ప‌రుగు వ‌ద్ద‌ని వారించ‌డంతో జ‌డేజా వెన‌క్కి ప‌రిగెత్తే క్ర‌మంలో త‌న దిశ‌ను మార్చుకున్నాడు. అప్ప‌టికే బంతిని అందుకున్న కీప‌ర్ శాంస‌న్ బంతిని విస‌ర‌డం, అదే స‌మ‌యంలో జ‌డేజా అడ్డు రావ‌డంతో అంపైర్ అబ్‌స్ట్ర‌క్టింగ్ ది ఫీల్డ్ కింద ఔటిచ్చాడు.

అంగ్‌క్రిష్ ర‌ఘువంశీ
తాజాగా 2026 సీజ‌న్‌లో కేకేఆర్ బ్యాట‌ర్ అంగ్‌క్రిష్ రఘువంశీ ఇదే త‌ర‌హాలో ఔట‌య్యాడు. కేకేఆర్‌ ఇన్నింగ్స్ 5వ ఓవర్ ప్రిన్స్ యాద‌వ్ బౌలింగ్‌లో ఆఖ‌రి బంతికి రఘువంశీ మిడ్-ఆన్ వైపు షాట్ ఆడి సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే మిడ్ ఆన్‌లో ఉన్న మ‌హ్మ‌ద్ ష‌మీ బంతిని వేగంగా అందుకోవ‌డంతో.. ర‌ఘువంశీ స‌గం దూరం వెళ్ళాక మళ్ళీ వెన‌క్కి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించాడు. 

అయితే వెన‌క్కి వెళ్లే క్ర‌మంలో ష‌మీ త్రో చేసిన బంతి రఘువంశీ కాలికి తగిలి వికెట్ కీపర్ పంత్ చేతికి వెళ్లలేదు. అయితే రఘువంశీ కావాలనే తన దారిని మార్చుకుని వెన‌క్కి పరిగెత్తాడని పంత్ అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్‌కు అప్పీల్‌ చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్‌లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. చాలా సేపు రీప్లేలను పరిశీలించిన టీవీ అంపైర్.. రఘువంశీ కావాలనే ఫీల్డర్ విసిరిన బంతికి అడ్డుపడ్డాడని నిర్ధారించారు. దీంతో ఆర్టికల్ 37 ప్రకారం అతడిని అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్  కింద అవుట్‌గా ప్రకటించారు.

చదవండి: ‘నేను చాలా మారాను.. మునుపటి పాండ్యాను కాను’

Advertisement
 
Advertisement
Advertisement