అండర్ 19 వరల్డ్‌కప్‌ హీరో రాజ్ బవాకి యువరాజ్‌ సింగ్‌తో ఉన్న లింక్‌ ఏంటి..?

What Is The Connection Between Raj Angad Bawa And Yuvraj Singh - Sakshi

అండర్ 19 ప్రపంచకప్ 2022 ఫైనల్లో 5 వికెట్ల ప్రదర్శన(5/31)తో చెలరేగి, అనంతరం బ్యాట్‌(54 బంతుల్లో 35; 2 ఫోర్లు, సిక్స్‌)తో కూడా రాణించి.. టీమిండియా ఐదో ప్రపంచకప్‌ టైటిల్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించిన డాషింగ్‌ యంగ్‌ ఆల్‌రౌండర్‌ రాజ్‌ అంగద్‌ బవాపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో అతను ఎవరు, అతని బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటీ అని భారత క్రికెట్‌ అభిమానులు ఆరా తీయడం మొదలు పెట్టగా, ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. 

రాజ్ బవా తండ్రి సుఖ్విందర్ బవా.. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, సిక్సర్ల కింగ్‌ యువరాజ్ సింగ్‌కు కోచ్‌గా వ్యవహరించాడన్న విషయం తెలిసింది. సుఖ్విందర్ పర్యవేక్షణలో యువరాజ్‌ అండర్‌ 19 ప్రపంచకప్‌ 2000లో ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు. ఇక్కడ మరో విశేషమేమింటంటే.. రాజ్‌బవా తాత సర్దార్ తర్లోచన్ సింగ్ బవా కూడా భారత క్రీడారంగంతో సంబంధం ఉంది. తర్లోచన్ సింగ్ బవా, 1948 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత హాకీ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. యాదృచ్చికంగా ఆ ఒలింపిక్స్‌లో తర్లోచన్ సింగ్ ప్రాతినిధ్యం వహించిన భారత హాకీ జట్టు ఫైనల్లో గ్రేట్ బ్రిటన్‌ను ఓడించి స్వర్ణం నెగ్గగా.. తాజాగా మనవడు రాజ్ బవా కూడా ఫైనల్లో ఇంగ్లండ్‌పైనే చెలరేగి టీమిండియాకు అండర్-19 వరల్డ్‌కప్ అందించాడు.

కాగా, రాజ్‌ బవా.. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లోనే కాకుండా టోర్నీ ఆధ్యాంతం మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. 6 వన్డేల్లో 9 వికెట్లతో పాటు 252 పరుగులు చేసి ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. ఇందులో బవా ఓ ఐదు వికెట్ల ప్రదర్శనతో పాటు సౌతాఫ్రికాపై (4/47) నాలుగు వికెట్ల ఘనతను సాధించాడు. అలాగే ఉగాండా(108 బంతుల్లో 162 నాటౌట్‌; 14 ఫోర్లు, 8 సిక్సర్లు)తో జరిగిన లీగ్‌ దశ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. అంతకుముందు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లతో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించి 42 పరుగులు చేశాడు. 
చదవండి: తన ఆరాధ్య గాయనికి కన్నీటి నివాళులర్పించిన క్రికెట్‌ గాడ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top