ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ల కోసం వెస్టిండీస్‌ జట్టు ప్రకటన | West Indies Have Announced 15 Member Squad For Six 50 Over Matches In Europe Against Ireland And England | Sakshi
Sakshi News home page

ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ల కోసం వెస్టిండీస్‌ జట్టు ప్రకటన

May 6 2025 4:43 PM | Updated on May 6 2025 5:04 PM

West Indies Have Announced 15 Member Squad For Six 50 Over Matches In Europe Against Ireland And England

వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు ఈ నెలాఖరులో యూరప్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఈ పర్యటనల్లో వన్డే సిరీస్‌ల కోసం 15 మంది సభ్యుల జట్టును విండీస్‌ క్రికెట్‌ బోర్డు ఇవాళ ప్రకటించింది. విండీస్‌ జట్టుకు నాయకుడిగా షాయ్‌ హోప్‌ వ్యవహరించనున్నాడు. అతనికి మద్దతుగా అనుభవజ్ఞులైన టాపార్డర్‌ బ్యాటర్లు బ్రాండన్‌ కింగ్‌, ఎవిన్‌ లెవిస్‌, కీసీ కార్టీ ఉన్నారు. 

యువ సంచలనం జువెల్‌ ఆండ్రూ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆండ్రూ గతేడాది అండర్‌-19 వరల్డ్‌కప్‌లో విశేషంగా రాణించాడు. ఆ టోర్నీలో 4 మ్యాచ్‌ల్లో సెంచరీ, హాఫ్‌ సెంచరీ సాయంతో 207 పరుగులు చేశాడు. ఈ ఏడాది బంగ్లాదేశ్‌ను 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసిన జట్టులోని సభ్యులందరూ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఐపీఎల్‌ కారణంగా విధ్వంసకర బ్యాటర్‌ షిమ్రోన్‌ హెట్‌మైర్‌ ఒక్కడు మిస్‌ అయ్యాడు. రొమారియో షెపర్డ్‌ లాంటి ఆటగాళ్లు కూడా ఐపీఎల్‌లో ఆడుతున్నా ఈ జట్టులో ఎంపిక చేశారు.

ఐపీఎల్‌ చివరి దశలో ఉండగా విండీస్‌ యూరప్‌ పర్యటన మొదలవుతుంది. ఐపీఎల్‌ 2025 మే 25న పూర్తి కానుండగా.. ఐర్లాండ్‌లో వెస్టిండీస్‌ పర్యటన మే 21న ప్రారంభమవుతుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20లు జరుగనున్నాయి. మే 21, 23, 25 తేదీల్లో డబ్లిన్‌ వేదికగా మూడు వన్డేలు జరుగుతాయి. ఈ పర్యటనలో టీ20 సిరీస్‌ కోసం​ విండీస్‌ క్రికెట్‌ బోర్డు జట్టును ప్రకటించలేదు.

ఈ పర్యటన ముగిసిన అనంతరం​ విండీస్‌ జట్టు ఇంగ్లండ్‌కు బయల్దేరుతుంది. ఈ పర్యటనలో కూడా మూడు వన్డేలు, మూడు టీ20లు జరుగనున్నాయి. మే 29, జూన్‌ 1, జూన్‌ 3వ తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. తొలి వన్డే బర్మింగ్హమ్‌, రెండో వన్డే కార్ఢిఫ్‌, మూడో వన్డే లండన్‌లో జరుగనున్నాయి. ఈ పర్యటనలో టీ20 సిరీస్‌ కోసం విండీస్‌ జట్టును ప్రకటించాల్సి ఉంది.

ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ల కోసం వెస్టిండీస్ జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), జువెల్ ఆండ్రూ, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, జస్టిన్ గ్రీవ్స్, అమీర్ జాంగూ, అల్జరి జోసెఫ్, షమార్ జోసఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లెవిస్, గుడకేష్ మోటీ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, జేడన్ సీల్స్, రొమారియో షెపర్డ్

కాగా, ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ పర్యటనల్లో ఆడబోయే వన్డేలు 2027 ఐసీసీ మెన్స్‌ క్రికెట్‌ ప్రపంచకప్‌ నేపథ్యంలో వెస్టిండీస్‌కు చాలా కీలకంగా పరిగణించబడతాయి. ఈ వరల్డ్‌కప్‌కు విండీస్‌ నేరుగా అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్‌లు తప్పనిసరిగా గెలవాలి.

ఇదిలా ఉంటే, ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ల కోసం జట్టును ప్రకటించిన విండీస్‌ క్రికెట్‌ బోర్డు.. కోచింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో ఓ కీలక మార్పు చేసింది. జేమ్స్‌ ఫ్రాంక్లిన్‌ స్థానంలో 2012 టీ20 వరల్డ్‌కప్‌ విన్నర్‌ రవి రాంపాల్‌ను బౌలింగ్‌ కోచ్‌గా నియమించింది. 

Advertisement
 
Advertisement
Advertisement