విండీస్‌కు మరో శరాఘాతం | West Indies all rounder Russell retires from international cricket | Sakshi
Sakshi News home page

విండీస్‌కు మరో శరాఘాతం

Jul 18 2025 4:00 AM | Updated on Jul 18 2025 4:00 AM

West Indies all rounder Russell retires from international cricket

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ రసెల్‌

టి20 ప్రపంచకప్‌నకు 7 నెలల ముందు అనూహ్య నిర్ణయం

ఫ్రాంఛైజీ క్రికెట్‌కే పెద్దపీట వేస్తున్న కరీబియన్‌ క్రికెటర్లు  

భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లతో పాటు అంపైర్లను సైతం భయపెట్టగల హిట్టర్‌... పరిస్థితులతో సంబంధం లేకుండా బంతిపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడగల ‘మిసైల్‌’... అవసరమైనప్పుడల్లా బంతితో బోల్తా కొట్టించగల బౌలర్‌... మైదానంలో అసాధారణ ఫీల్డింగ్‌తో కట్టిపడేయగల అథ్లెట్‌... ఇలా అన్ని రంగాల్లో ఆకట్టుకున్న వెస్టిండీస్‌ డేంజర్‌మ్యాన్‌ ఆండ్రె రసెల్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 

ఇప్పటికే టెస్టు క్రికెట్‌లో అధఃపాతాళానికి చేరిన వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టుకు రసెల్‌ నిర్ణయం మరో శరాఘాతంలా మారింది. ఇంకో ఏడు నెలల్లో టి20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో... ఇటీవల నికోలస్‌ పూరన్‌ రిటైర్మెంట్‌ ప్రకటించగా... ఇప్పుడు రసెల్‌ కూడా ఆ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో కరీబియన్‌ జట్టు కష్టాలు మరింత పెరగనున్నాయి.  

సాక్షి క్రీడావిభాగం : వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టుకు మరో షాక్‌ తగిలింది. స్టార్‌ బ్యాటర్, మాజీ కెప్టెన్‌ 29 ఏళ్ల నికోలస్‌ పూరన్‌ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా... ఇప్పుడు ఆల్‌రౌండర్‌ రసెల్‌ కూడా అదే బాటపట్టాడు. 
అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు 37 ఏళ్ల రసెల్‌ తాజాగా వెల్లడించాడు. సొంతగడ్డపై ఆ్రస్టేలియాతో జరగనున్న రెండో టి20 అనంతరం కెరీర్‌ను ముగించనున్నట్లు ప్రకటించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌ విషయం పక్కన పెడితే... పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మెరుగైన ఆల్‌రౌండర్‌గా ముద్రపడ్డ రసెల్‌ సేవలను విండీస్‌ బోర్డు సరిగ్గా వినియోగించుకోలేకపోయిందనే చెప్పొచ్చు. 

లోయర్‌ ఆర్డర్‌లో భారీ షాట్లతో జట్టుకు ఊహించని స్కోరు అందించగల నైపుణ్యంతో పాటు... వైవిధ్యమైన పేస్‌తో ప్రత్యరి్థని బోల్తా కొట్టించగల రసెల్‌ 2019లో జాతీయ జట్టు తరఫున చివరి వన్డే ఆడాడు. అప్పటి నుంచి కేవలం టి20లకే పరిమితమైన ఈ జమైకా స్టార్‌... ఇప్పుడు దానికి కూడా టాటా చెప్పనున్నాడు. 2026 ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న టి20 ప్రపంచకప్‌నకు మరో ఏడు నెలల వ్యవధి మాత్రమే ఉండగా... దానికి ముందు రసెల్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. 

తాజాగా ఆ్రస్టేలియాతో చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 27 పరుగులకే ఆలౌటై భారీ విమర్శలు మూటగట్టుకున్న కరీబియన్‌ జట్టు... ఇక ముందు టి20 ఫార్మాట్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేయడం కష్టమే అనిపిస్తోంది. ఒకప్పుడు జట్టు నిండా అద్భుతమైన బ్యాటర్లు, అరివీర భయంకర బౌలర్లు ఉన్న విండీస్‌ జట్టు... ఇప్పుడు రోజు రోజుకు ప్రమాణాలు పడిపోతూ పాతాళం దిశగా పయనిస్తోంది. 

లీగ్‌లకే పరిమితం... 
విశ్వవ్యాప్తంగా ఎక్కడ టి20 లీగ్‌లు జరుగుతున్నా... అందులో ప్రధానంగా కనిపించే ప్లేయర్లు కరీబియన్లే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌ ఇలా అన్నింట్లో ముందుండే విండీస్‌ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలన్నీ పోటీపడుతుంటాయి. క్రిస్‌ గేల్‌ నుంచి మొదలుకొని పొలార్డ్, బ్రావో, రసెల్, నరైన్, హెట్‌మైర్, పూరన్‌ ఇలా ఈ జాబితా చాంతాడంత పెద్దది. రసెల్‌ విషయానికి వస్తే... అతడు ఆడని లీగ్‌ లేదంటే అతిశయోక్తి కాదు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రసెల్‌... ప్రపంచంలో ఎక్కడ లీగ్‌ జరుగుతున్నా అందులో దర్శనమివ్వడం పరిపాటి. 

ఐపీఎల్‌తో పాటు బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (బీపీఎల్‌), కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌), బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌), పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌), అఫ్గానిస్తాన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌), లంక ప్రీమియర్‌ లీగ్‌ (ఎల్‌పీఎల్‌), విటాలిటీ బ్లాస్ట్, చాంపియన్‌ లీగ్‌ టి20 (సీఎల్‌టి20), మేజర్‌ క్రికెట్‌ లీగ్, హండ్రెడ్‌ ఇలా లెక్కకు మిక్కిలి లీగ్‌ల్లో రసెల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జట్టుకు అవసరమైన దశలో బ్యాటింగ్‌కు దిగి మెరుపులు మెరిపించడంతో పాటు... బంతితోనూ ఆకట్టుకోగల నైపుణ్యం రసెల్‌ సొంతం. 

ఇలాంటి ఆల్‌రౌండర్‌ను సరిగ్గా వినియోగించుకోలేకపోయిన విండీస్‌ క్రికెట్‌ బోర్డు... కనీసం వరల్డ్‌కప్‌ వరకు అతడిని కొనసాగమనే దిశగా కూడా ప్రయత్నాలు చేయలేకపోయింది. ఒకప్పుడు రసెల్‌తో కలిసి డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకున్న డారెన్‌ స్యామీ ఇప్పుడు విండీస్‌ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తుండగా... అతడు కూడా తన సహచరుడికి సర్దిచెప్పలేని పరిస్థితి.  

హార్డ్‌ హిట్టర్‌... 
2010 తొలినాళ్లలో భారీ హిట్టింగ్‌తో వెలుగులోకి వచ్చిన రసెల్‌... 2011 వన్డే ప్రపంచకప్‌ ఆడిన వెస్టిండీస్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే అక్కడ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఈ జమైకన్‌... ఆ తర్వాత ప్రపంచ చాంపియన్‌ టీమిండియాతో మ్యాచ్‌లో రికార్డులు తిరగరాశాడు. నార్త్‌సౌండ్‌ వేదికగా జరిగిన మూడో వన్డేలో 96 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడ్డ సమయంలో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రసెల్‌... 64 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌ల సహాయంతో 92 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

ఆ మ్యాచ్‌లో విండీస్‌ ఓడినా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు గెలుచుకోవడంతో పాటు... వన్డేల్లో 9వ స్థానంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఇక వన్డే కెరీర్‌లో అత్యధిక స్ట్రయిక్‌రేట్‌ (130.22) గల బ్యాటర్‌గా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. 2012, 2016లో ఐసీసీ టి20 వరల్డ్‌కప్‌ గెలిచిన వెస్టిండీస్‌ జట్టులో సభ్యుడైన రసెల్‌... కెరీర్‌లో ఏకైక టెస్టు 2010లో శ్రీలంకపై ఆడాడు. ఆ తర్వాత కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితమైన ఈ ఆల్‌రౌండర్‌... పలు మ్యాచ్‌ల్లో తన ప్రదర్శనతో జట్టుకు విజయాలు అందించాడు.

ముఖ్యంగా జట్టు ఆశలన్నీ వదిలేసుకున్న సమయంలో అనూహ్య హిట్టింగ్‌తో చెలరేగి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపడం రసెల్‌కు అలవాటు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే గొప్ప అనుకునే స్థాయి నుంచి... దేశం తరఫున ఆడటం కన్నా లీగ్‌ల్లో పాల్గొనడమే మిన్న అనే స్థాయికి రసెల్‌ ఎదగగా... అలాంటి నిఖార్సైన ఆల్‌రౌండర్‌ను సరైన రీతిలో వాడుకోలేని వైచిత్ర విండీస్‌ బోర్డుది.  

కేకేఆర్‌ కీలక ప్లేయర్‌ 
లీగ్‌ల ప్రాధాన్యత పెరిగిన తర్వాత ఇక జాతీయ జట్టుకు ఆడాలనే లక్ష్యాన్నే పక్కన పెట్టిన వెస్టిండీస్‌ ప్లేయర్లు... విశ్వవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్‌లో సత్తా చాటుతున్నారు. ఐపీఎల్‌లో ఏజట్టును పరిశీలించినా అందులో కీలక పాత్ర పోషిస్తున్నది విండీస్‌ ప్లేయర్లే. 2012లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన రసెల్‌... తొలి రెండు సీజన్‌లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 2014లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు మారిన అనంతరం అతడి ఆట మరోస్థాయికి చేరింది. లోయర్‌ ఆర్డర్‌లో కీలక పరుగులు చేయడంతో పాటు... ప్రత్యర్థికి అంతుచిక్కని తన బౌలింగ్‌తో కేకేఆర్‌ జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. 

ఫ్రాంచైజీ తరఫున ఆడిన తొలి సీజన్‌లోనే చాంపియన్‌గా నిలిచిన రసెల్‌... అప్పటి నుంచి అదే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2015 ఐపీఎల్‌ సీజన్‌లో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో విజృంభించిన ఈ జమైకన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోరీ్న’గా నిలిచాడు. కేకేఆర్‌ తరఫున 170కి పైగా స్ట్రయిక్‌ రేట్‌తో 2400 పైచిలుకు పరుగులు చేసిన రసెల్‌... 100కు పైగా వికెట్లు సైతం పడగొట్టాడు. ఇప్పుడిక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికేయడంతో లీగ్‌లపై మరింత దృష్టి పెట్టడం ఖాయమే!   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement