Ind Vs Aus: ఆసీస్‌తో మ్యాచ్‌ అంటే ఆ మజానే వేరు.. రోహిత్‌ సేన మాదిరి మీరు కూడా!

WC 2023 Semis Harmanpreet Says India Enjoys Playing Against Australia - Sakshi

ICC Womens T20 World Cup 2023 - India vs Australia: ‘‘ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ అంటే ఆ మజానే వేరు. వాళ్లతో మ్యాచ్‌ ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాం. ఇరు జట్లకు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. అయితే, ఒత్తిడికి లోనుకాకుండా స్వేచ్ఛాయుతంగా బ్యాటింగ్‌ చేస్తేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలుగుతాం’’ అని భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పేర్కొంది.

సెమీస్‌లో ఆసీస్‌తో అమీ తుమీ తేల్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కాగా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2023 టోర్నీలో భాగంగా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఐర్లాండ్‌ను ఓడించింది.

స్మృతి అద్భుత ఇన్నింగ్స్‌తో
దక్షిణాఫ్రికాలోని సెయింట్‌ జార్జ్‌ మైదానంలో సోమవారం జరిగిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఈ క్రమంలో డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో 5 పరుగుల తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది హర్మన్‌ప్రీత్‌ సేన.

స్మృతి మంధాన అద్భుత ఇన్నింగ్స్‌ కారణంగా కీలక మ్యాచ్‌లో గెలుపొంది సెమీస్‌ ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 23 నాటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.  కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీ ఫైనల్‌ జరుగనుంది.

గొప్ప విషయం
ఈ నేపథ్యంలో ఐర్లాండ్‌తో మ్యాచ్‌ ముగిసిన అనంతరం భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మాట్లాడుతూ.. ఓపెనర్‌ స్మృతి మంధానపై ప్రశంసలు కురిపించింది. ‘‘కీలక మ్యాచ్‌లో స్మృతి ఆడిన అత్యంత విలువైన ఇన్నింగ్స్‌ ఆడింది. తను శుభారంభం అందించిన ప్రతిసారి మేము భారీ స్కోరు చేయగలుగుతాం. ఈసారి కూడా అదే జరిగింది. సెమీస్‌ చేరడం ఎంతో గొప్ప విషయం.

రోహిత్‌ సేన మాదిరే మీరు కూడా!
ఇక్కడిదాకా చేరుకోవడానికి మేము చాలా కష్టపడ్డాం. ఇక సెమీస్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ ఉంది. వాళ్లతో పోటీలో మజా ఉంటుంది. ఫైనల్‌ చేరేందుకు మేము వందకు వంద శాతం ప్రయత్నిస్తాం’’ అని హర్మన్‌ప్రీత్‌కౌర్‌ చెప్పుకొచ్చింది.

ఇక స్వదేశంలో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియాను చిత్తు చేస్తూ.. రోహిత్‌ సేన వరుస విజయాలు సాధిస్తున్న వేళ.. మహిళా జట్టు సైతం ఆసీస్‌ను వరల్డ్‌కప్‌ సెమీస్‌లో ఓడించాలని అభిమానులు కోరుకుంటున్నారు. హర్మన్‌ప్రీత్‌ బృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు.

ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో భారత క్రికెటర్ల రికార్డులు
►ఐర్లాండ్‌ మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో 150 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ రికార్డు నెలకొల్పింది. 2009 తొలి టి20 ప్రపంచకప్‌లో మొదటి మ్యాచ్‌ ఆడిన హర్మన్‌ 2023లో టి20 ప్రపంచకప్‌లోనే తన 150వ మ్యాచ్‌ ఆడటం విశేషం.

►అంతర్జాతీయ మహిళల టి20ల్లో 3,000 పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో క్రికెటర్‌గా, భారత్‌ నుంచి ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా హర్మన్‌ప్రీత్‌ గుర్తింపు పొందింది. టాప్‌–3లో సుజీ బేట్స్‌ (3,820–న్యూజిలాండ్‌), మెగ్‌ లానింగ్‌ (3,346–ఆస్ట్రేలియా), స్టెఫానీ టేలర్‌ (3,166–వెస్టిండీస్‌) ఉన్నారు.  

►టి20 ప్రపంచకప్‌ టోర్నీలో భారత మహిళల జట్టు సెమీఫైనల్‌ చేరుకోవడం ఇది ఐదోసారి. 2009, 2010, 2018లలో సెమీఫైనల్లో ఓడిన భారత్‌ 2020లో రన్నరప్‌గా నిలిచింది.

ఇండియా వర్సెస్‌ ఐర్లాండ్‌ స్కోర్లు
ఇండియా- 155/6 (20)
ఐర్లాండ్‌ 54/2 (8.2)

చదవండి: BGT 2023: రెండున్నర రోజుల్లోనే టెస్టు ముగిస్తే ఇంతే! అయినా.. గాయం సంగతి ఏమైంది?    
ఆస్ట్రేలియా క్రికెట్‌లో కలవరం.. తర్వాత ఎవరు?
Women T20 WC: ఆస్ట్రేలియాను ఓడిస్తే వరల్డ్‌కప్‌ మనదే..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top