BGT 2023: రెండున్నర రోజుల్లోనే టెస్టు ముగిస్తే ఇంతే! అయినా.. గాయం సంగతి ఏమైంది?

Ind Vs Aus Delhi: Injured David Warner Chills With Family Fans Reacts - Sakshi

India vs Australia Test Series- David Warner: ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ తనకు దొరికిన ఖాళీ సమయాన్ని కుటుంబానికి కేటాయించాడు. భార్యాపిల్లలతో కలిసి ఢిల్లీలోని హుమాయున్‌ సమాధిని దర్శించాడు. మొఘల్‌ కాలంనాటి కట్టడాలు చూసి అబ్బురపడ్డాడు. అక్కడి దృశ్యాలను స్వయంగా కెమెరాలో బంధించాడు.

భార్య కాండిస్‌, తమ ముగ్గురు కూతుళ్లతో కలిసి అక్కడ దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి మురిసిపోయాడు. దీంతో నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘రెండున్నర రోజుల్లోనే టెస్టు ముగిసిపోతే ఆటగాళ్లకు ఇలా విరామం దొరకుతుందన్న మాట.. మొన్న టీమిండియా.. ఇప్పుడు వార్నర్‌.. భలే ఎంజాయ్‌ చేస్తున్నారు’’ అని అంటున్నారు.

గాయం సంగతి ఏమైంది?
ఇక మరికొందరేమో.. ‘‘వార్నర్‌ భాయ్‌ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. కానీ ఫ్యామిలీకి మాత్రం సమయం కేటాయిస్తున్నాడు. గాయం నుంచి కోలుకోవడంపై కూడా కాస్త దృష్టి పెట్టు’’ అంటూ సూచిస్తున్నారు. కాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ నేపథ్యంలో ఆస్ట్రేలియా భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో నాలుగు టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లలో ఆతిథ్య టీమిండియా చేతిలో ఓటమి పాలైంది. నాగ్‌పూర్‌, ఢిల్లీ టెస్టులను రెండున్నర రోజుల్లోనే ముగించి రోహిత్‌ సేన సత్తా చాటగా.. ప్యాట్‌ కమిన్స్‌ బృందం కనీస పోరాట పటిమ కనబరచలేకపోయింది.

మోచేయి ఫ్యాక్చర్‌!
ఇదిలా ఉంటే.. ఓపెనర్‌ వార్నర్‌ ఈ రెండు మ్యాచ్‌లలో పెద్దగా రాణించింది లేదు. రెండు మ్యాచ్‌లలో కలిపి అతడు సాధించినవి 26 పరుగులు. ఇక ఢిల్లీ టెస్టు మధ్యలోనే మోచేతి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో ఎల్బో ఫాక్చర్‌ అయినట్లు తేలడంతో మిగిలిన రెండు మ్యాచ్‌లకు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. 

ఈ నేపథ్యంలో వార్నర్‌ ఫొటోలు షేర్‌ చేయడంతో అభిమానులు ఈ మేరకు స్పందిస్తున్నారు. ఇక ఢిల్లీ టెస్టు ముగియగానే టీమిండియా.. ప్రధానమంత్రి సంగ్రహాలయను సందర్శించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మార్చి 1 నుంచి ఇండోర్‌లో మూడో టెస్టు ఆరంభం కానుంది.

చదవండి: ఆస్ట్రేలియా క్రికెట్‌లో కలవరం.. తర్వాత ఎవరు?
IND vs AUS: ఆస్ట్రేలియా చేసిన తప్పులు ఇవే.. అందుకే ఓడిపోయింది! అలా చేసి ఉంటే?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top