BGT 2023: 'ఓరి మీ వేశాలో.. కాస్త ఎక్కువైనట్టుంది!'

Memes Galore As Steve Smith Inspects Pitch Ahead 1st-Test Vs India - Sakshi

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 9 నుంచి(గురువారం) టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. నాగ్‌పూర్‌ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో తొలి మూడు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని.. చివరి రెండు రోజులు మాత్రం స్పిన్నర్లు ప్రభావం చూసే అవకాశం ఉంటుందని పిచ్‌ క్యూరేటర్‌ ఇప్పటికే స్పష్టం చేశాడు.

అయితే ఆసీస్‌ స్టార్‌ క్రికెటర్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లు నాగ్‌పూర్‌ పిచ్‌ను క్షుణ్ణంగా పరిశీలించడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆస్ట్రేలియా క్రికెట్‌ తన ట్విటర్‌లో ఈ ఫోటోలు షేర్‌ చేసుకుంది. మంగళవారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో వైస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ మాట్లాడుతూ.. ''పిచ్‌ చాలా పొడిగా ఉంది. ఎక్కువగా స్పిన్‌కు అనుకూలంగా ఉంటుదన్నారు.ముఖ్యంగా మ్యాచ్‌లో ఎడమచేతి వాటం స్పిన్నర్లు ప్రభావం చూపే అవకాశం ఉంది. వికెట్‌పై బౌన్స్‌ ఎక్కువగా ఉంటుదనుకోవడం లేదు. సీమర్‌లకు అనుకూలమైనప్పటికి మ్యాచ్‌ సాగుతున్న కొద్ది పిచ్‌లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. పిచ్‌పై అక్కడక్కడా పగుళ్లు కూడా ఉన్నాయి. నాకు పూర్తిగా తెలియదు వేచి చూడాల్సిందే'' అంటూ చెప్పుకొచ్చాడు.

అయితే స్మిత్‌ పిచ్‌ను పరిశీలించడంపై టీమిండియా ఫ్యాన్స్‌ ట్రోల్స్‌, మీమ్స్‌తో రెచ్చిపోయారు. ''మీరు ఎన్నిసార్లు చెక్‌ చేసినా మ్యాచ్‌లో టీమిండియా గెలవడం ఖాయం''.. ''భారత స్పిన్నర్లను ఎదుర్కొని నిలబడడం కష్టమే''.. ''స్మిత్‌ పిచ్‌ను పరిశీలిస్తుంటే నాకు పఠాన్‌ సినిమాలోని బేషరమ్‌ సాంగ్‌ గుర్తుకువస్తుంది..'' అంటూ ట్రోల్స్‌తో రెచ్చిపోయారు.

ఇక స్టీవ్‌ స్మిత్‌కు భారత్‌ గడ్డపై టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు భారత్‌లో ఆరు టెస్టులాడిన స్మిత్‌ 12 ఇన్నింగ్స్‌లు కలిపి 60 సగటుతో 660 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీ ఉంది. 178 అత్యధిక స్కోరుగా ఉంది. ఇక డేవిడ్‌ వార్నర్‌ మాత్రం మెరుగైన ప్రదర్శన కనబరచలేకపోయాడు. ఎనిమిది టెస్టులాడిన వార్నర్‌ 16 ఇన్నింగ్స్‌లు కలిపి 24.25 సగటుతో కేవలం 388 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మూడు అర్థసెంచరీలు మాత్రమే చేయగలిగిన వార్నర్‌కు అత్యధిక స్కోరు 71గా ఉంది.

చదవండి: కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ అందుకున్న టీమిండియా ఆల్‌రౌండర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top