వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో ఇదే మొదటిసారి.. బుమ్రా అరుదైన రికార్డు | ICC ODI WC 2023 Ind Vs Aus: Jasprit Bumrah Becomes 1st Indian Bowler To Break Unique Record In ODI WC - Sakshi
Sakshi News home page

Jasprit Bumrah ODI WC Record: వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో ఇదే మొదటిసారి.. భారత తొలి బౌలర్‌గా బుమ్రా రికార్డు

Published Mon, Oct 9 2023 3:34 PM

WC 2023 Ind Vs Aus: Bumrah Becomes 1st Indian Bowler Unique Record In ODI WC - Sakshi

వరల్డ్‌కప్‌-2023లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో ఆసీస్‌ ఓపెనర్‌ను డకౌట్‌ చేసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. కాగా చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఆదివారం మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే.

ఇందులో టాస్‌ గెలిచిన కంగారూ జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో మూడో ఓవర్‌ రెండో బంతికి బుమ్రా.. మిచెల్‌ మార్ష్‌ను అవుట్‌ చేశాడు. ఆఫ్‌సైడ్‌ దిశగా బుమ్రా విసిరిన షార్ట్‌లెంత్‌ బాల్‌ మార్ష్‌ బ్యాట్‌ను ముద్దాడి ఫస్ట్‌స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లి చేతుల్లో పడింది.

దీంతో టీమిండియాకు తొలి వికెట్‌ దక్కడంతో పాటు.. బుమ్రా ఖాతాలో అరుదైన రికార్డు నమోదైంది. కాగా 1983 నుంచి ఇప్పటి వరకు.. 2007 వన్డే ప్రపంచకప్‌ మినహాయించి పటిష్ట టీమిండియా- ఆస్ట్రేలియా జట్లు ఈ ఐసీసీ టోర్నీల్లో కనీసం ఒక్కసారైన ముఖాముఖి పోటీపడ్డాయి.

అయితే, ఏ భారత బౌలర్‌ కూడా ఈ మెగా ఈవెంట్లో ఆసీస్‌ ఓపెనర్‌ను డకౌట్‌ చేసిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి మ్యాచ్‌తో బుమ్రా ఆ రికార్డును బ్రేక్‌ చేశాడు. మార్ష్‌ చేత సున్నా చుట్టించి ఈ ఘనత సాధించిన టీమిండియా తొలి బౌలర్‌గా చరిత్రకెక్కాడు.

కాగా కంగారూలతో మ్యాచ్‌లో బుమ్రా రెండు, స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌ రెండు, రవీంద్ర జడేజా మూడు, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఒక వికెట్‌ తీయగా.. ఫాస్ట్‌బౌలర్లు మహ్మద్‌ సిరాజ్‌, హార్దిక్‌ పాండ్యాకు ఒక్కో వికెట్‌ దక్కాయి. దీంతో 199 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్‌ అయింది.

అయితే, స్వల్ప లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడిన భారత్‌ విరాట్‌ కోహ్లి(85), కేఎల్‌ రాహుల్‌(97- నాటౌట్‌) అద్బుత ఇన్నింగ్స్‌తో 41.2 ఓవర్లలో టార్గెట్‌ ఛేదించి ఆరు వికెట్ల తేడతో గెలుపొందింది. తద్వారా వన్డే వరల్డ్‌కప్‌-2023లో బోణీ కొట్టింది. 

ఇక ఈ మ్యాచ్‌లో మొత్తగా ఐదు డకౌట్లు నమోదు కావడం గమనార్హం. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో మార్ష్‌, అలెక్స్‌ క్యారీ.. టీమిండియా ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మ, శ్రేయస్‌ అయ్యర్‌ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు.

Advertisement
Advertisement