మనిద్దరం కలిసి ఈ జట్టును శక్తిమంతంగా తీర్చిదిద్దాం: రవిశాస్త్రి
Ravi Shastri Reacts To Kohli Decision: ‘‘విరాట్... నువ్వు తలెత్తుకుని సగర్వంగా ముందుకు వెళ్లవచ్చు. కెప్టెన్‌గా నీలాంటి అద్బుత విజయాలు కొంతమంది మాత్రమే సాధించగలరు. భారత జట్టు అత్యంత విజయవంతమైన, దూకుడైన సారథివి కచ్చితంగా నువ్వే. అయితే, వ్యక్తిగతంగా నాకిది విచారకరమైన రోజు. మనిద్దరం కలిసి ఈ జట్టును శక్తిమంతంగా తీర్చిదిద్దాం కదా కోహ్లి’’ అంటూ టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి భావోద్వేగాని లోనయ్యాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అతడితో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నాడు.
కాగా దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లి తాను భారత జట్టు టెస్టు నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కోహ్లి నిర్ణయం క్రీడా వర్గాలను ఆశ్చర్యపరిచింది. అయితే, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాత్రం ఇది కోహ్లి వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశాడు. కాగా 68 టెస్టు మ్యాచ్‌లకు కోహ్లి కెప్టెన్‌గా వ్యవహరించగా.. 40 విజయాలు అందుకున్నాడు. ఇక టెస్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన సందర్భంగా... మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిల పేర్లను కోహ్లి ప్రత్యేకంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
భారత టెస్టు క్రికెట్ అత్యున్నత స్థాయికి చేరడంలో రవి భాయ్ కీలకంగా వ్యవహరించాడని తనతో ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇక ధోని తనలోని నాయకత్వ లక్షణాలను గుర్తించి.. తనను ప్రోత్సహించాడని చెప్పుకొచ్చాడు. కాగా దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: Rohit Sharma- Virat Kohli: కోహ్లి నిర్ణయం విని షాకయ్యాను.. రోహిత్ శర్మ పోస్టు వైరల్

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
