
క్వాలిఫయర్‌గా వచ్చి చాంపియన్‌గా అవతరించిన మొనాకో టెన్నిస్ ప్లేయర్
షాంఘై ఓపెన్ ఏటీపీ–1000 సింగిల్స్ టైటిల్ హస్తగతం
మాస్టర్స్ సిరీస్ టైటిల్ గెలిచిన తక్కువ ర్యాంకర్‌గా గుర్తింపు
షాంఘై: ఊహకందని ప్రదర్శనతో ఆద్యంతం అదరగొట్టిన మొనాకో టెన్నిస్ ప్లేయర్ వాలెంటిన్ వాచెరోట్ తన కెరీర్‌లోనే చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం ముగిసిన షాంఘై ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 సిరీస్ టోర్నీలో ప్రపంచ 204వ ర్యాంకర్ వాలెంటిన్ చాంపియన్‌గా అవతరించాడు. క్వాలిఫయింగ్ రౌండ్‌లో రెండు మ్యాచ్‌ల్లో గెలిచి మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన వాలెంటిన్... మెయిన్ ‘డ్రా’లోనూ మెరిపించాడు.
ఫైనల్లో వాలెంటిన్ 4–6, 6–3, 6–3తో ఆర్థర్ రిండెర్‌నీచ్ (నెదర్లాండ్స్)పై గెలుపొంది తన కెరీర్‌లో తొలి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. విజేతగా నిలిచిన వాలెంటిన్‌కు 11 లక్షల 24 వేల 380 డాలర్ల (రూ. 9 కోట్ల 97 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
‘కంటి నుంచి ఆనందభాష్పాలు వస్తున్నాయి. జరిగింది నమ్మశక్యంగా లేదు. ఏటీపీ సర్క్యూట్‌లో నాకిది నాలుగో సీజన్ మాత్రమే. నా విజయం వెనుక నా శిక్షణ సిబ్బంది పాత్ర ఎంతో ఉంది’ అని ఏటీపీ సర్క్యూట్‌లో టైటిల్ నెగ్గిన తొలి మొనాకో ప్లేయర్‌గా గుర్తింపు పొందిన వాలెంటిన్ వ్యాఖ్యానించాడు.
క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో వాలెంటిన్ 7–6 (7/4), 6–3తో నిశేష్ బసవరెడ్డి (అమెరికా)పై, రెండో రౌండ్‌లో 4–6, 7–6 (7/5), 6–4తో లియామ్ డ్రాక్సెల్ (కెనడా)పై గెలిచి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్‌లో వాలెంటిన్ 6–3, 6–4తో లాస్లో జెరె (సెర్బియా)పై, రెండో రౌండ్‌లో 3–6, 6–3, 6–4తో 14వ సీడ్ అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)పై, మూడో రౌండ్‌లో 6–0, 3–1తో 20వ సీడ్ టామస్ మఖాచ్ (చెక్ రిపబ్లిక్–రిటైర్డ్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–6, 7–6 (7/1), 6–4తో 27వ సీడ్ టాలన్ గ్రీక్‌స్పూర్ (నెదర్లాండ్స్)పై, క్వార్టర్ ఫైనల్లో 2–6, 7–6 (7/4), 6–4తో 10వ సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్)పై, సెమీఫైనల్లో 6–3, 6–4తో నాలుగో సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)పై విజయం సాధించాడు.
5 కెరీర్‌లో తొలి టైటిల్ ‘మాస్టర్స్ సిరీస్’ టోర్నీని సాధించిన ఐదో ప్లేయర్‌గా వాలెంటిన్ నిలిచాడు. గతంలో రొబెర్టో కార్రెటెరో, అల్బెర్ట్ పొరా్టస్, క్రిస్ వుడ్‌రఫ్, జాకుబ్ మెన్‌సిక్ ఈ ఘనత సాధించారు.
3 క్వాలిఫయర్ హోదాలో ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టైటిల్ గెలిచిన మూడో ప్లేయర్‌గా వాలెంటిన్ నిలిచాడు. గతంలో రొబెర్టో కార్రెటెరో (స్పెయిన్; 1996లో హంబర్గ్ ఓపెన్), అల్బెర్ట్ పొరా్టస్ (స్పెయిన్; 2001లో హంబర్గ్ ఓపెన్) మాత్రమే ఈ ఘనత సాధించారు.
204 ఏటీపీ మాస్టర్స్ సిరీస్ (1990లో) టోర్నీలు ప్రవేశపెట్టాక మాస్టర్స్ సిరీస్ టైటిల్ గెలిచిన అతి తక్కువ ర్యాంకర్‌గా వాలెంటిన్ (204వ ర్యాంక్) గుర్తింపు పొందాడు.