భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 క్రికెట్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలంగా మారిపోయిందని.. ఇదే కొనసాగితే పొట్టి ఫార్మాట్ ప్రమాదంలో పడుతుందని అభిప్రాయపడ్డాడు.
గతేడాది కాలంగా రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. పద్నాలుగేళ్ల వయసులోనే ఫాస్టెస్ట్ సెంచరీ (35)తో కదంతొక్కిన ఈ బిహారీ పిల్లాడు.. ఈ ఏడాది ఏకంగా అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు.
ఆరెంజ్ క్యాప్ విజేత
ఐపీఎల్-2026లో మొత్తంగా పదహారు మ్యాచ్‌లలో కలిపి 776 పరుగులు సాధించిన వైభవ్.. ఆరెంజ్ క్యాప్‌తో పాటు మరెన్నో బహుమతులు గెలుచుకున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా, కగిసో రబడ వంటి స్టార్ బౌలర్ల బౌలింగ్‌లో సైతం వైభవ్ చితక్కొట్టడం విశేషం.
ఇక ఈ సీజన్‌లో ఏకంగా 72 సిక్సర్లు బాదిన వైభవ్ క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల ఆల్‌టైమ్ రికార్డును బద్దలుకొట్టాడు కూడా!.. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా మాజీ, వివాదాస్పద కోచ్ గ్రెగ్ చాపెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోకు రాసిన కాలమ్‌లో.. ‘‘పదిహేనేళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ టోర్నీనే శాసించే స్థితికి వెళ్లాడు. 237కు పైగా స్ట్రైక్‌రేటుతో ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఈ భూమి మీద ఉన్న అత్యుత్తమ బౌలర్లను కూడా తన బ్యాటింగ్‌తో ఉతికి ఆరేశాడు.
సీజన్‌లో 72 సిక్సర్లు బాది క్రిస్ గేల్ రికార్డునే బద్దలుకొట్టాడు. సంప్రదాయ క్రికెట్‌కు పూర్తి విరుద్ధంగా సరికొత్త బెంచ్‌మార్కు సృష్టించాడు. తనింకా పిల్లాడే. పూర్తి స్థాయిలో సీనియర్ ఆటగాడిగా మారిన తర్వాత అతడిని ఎవరూ ఆపలేరు.
ఇదొక ప్రమాదకర, అనారోగ్య సంకేతం
అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ బౌలర్లుగా గుర్తింపు పొందిన వారిని సైతం వేటాడేయగలడు. మారుతున్న క్రీడా విధానానికి ఇదొక ప్రమాదకర, అనారోగ్య సంకేతం. ఆధునిక టీ20 ఫార్మాట్ పారామీటర్లు కూడా మారిపోతున్నాయి.
ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ వంటి నిబంధనల వల్ల సమతూకం దెబ్బతింటోంది. బ్యాటింగ్ చేసే జట్టుకు అదనపు పవర్‌హిట్టర్‌ను ఆడించే వీలు దొరుకుతోంది. వైభవ్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్‌గా తన ప్రభావం చూపాడు’’ అని గ్రెగ్ చాపెల్ పేర్కొన్నాడు.
ఇలా అయితేనే టీ20 క్రికెట్‌ను కాపాడుకుందాం
అదే విధంగా.. టీ20 క్రికెట్‌ను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందంటూ గ్రెగ్ చాపెల్ ఈ సందర్భంగా మూడు ప్రధాన సూచనలు చేశాడు. ‘‘బ్యాటింగ్ చేసే జట్టుకు చేతిలో పది వికెట్లు కూడా ఆరు వికెట్లే ఉండాలి. అప్పుడు బ్యాటర్లు బాదడమే పనిగా పెట్టుకోకుండా మంచి టెక్నిక్‌తో ఆడే ప్రయత్నం చేశారు.
పిచ్‌ల మీద కనీసం 3 మి.మీ. మేర పచ్చిక ఉండేలా చూసుకోవాలి. తద్వారా కాస్త సీమ్ జనరేట్ అవుతుంది. ఒక్కోసారి పచ్చికతో కూడినవి.. మరోసారి పూర్తిగా పొడి పిచ్‌లను తయారు చేయాలి. తద్వారా వైవిధ్యం చేకూరుతుంది. లెగ్ బిఫోర్ వికెట్ విషయంలో కూడా మార్పులు చేయాలి’’ అని గ్రెగ్ చాపెల్ అభిప్రాయపడ్డాడు.


