క్రికెట్ చ‌రిత్ర‌లో సంచ‌ల‌నం.. ఒకే ఓవర్‌లో 45 పరుగులు | Usman Ghani smashed 45 runs in a single over during a T10 clash for LCC | Sakshi
Sakshi News home page

క్రికెట్ చ‌రిత్ర‌లో సంచ‌ల‌నం.. ఒకే ఓవర్‌లో 45 పరుగులు

Aug 2 2025 1:58 PM | Updated on Aug 2 2025 3:18 PM

Usman Ghani smashed 45 runs in a single over during a T10 clash for LCC

క్రికెట్‌లో ఒక‌ ఓవ‌ర్‌లో 36 ప‌రుగులు రావ‌డమే మ‌నం అరుదుగా చూస్తూ ఉంటాం. అటువంటిది ఓ ఆట‌గాడు ఏకంగా ఒకే ఓవ‌ర్‌లో ఏకంగా 45 ప‌రుగులు రాబాట్టాడు. అవును మీరు విన్న‌ది నిజ‌మే. పూర్తి వివ‌రాలు తెలియాలంటే ఈ కథ‌నం చ‌ద‌వాల్సిందే. అఫ్గానిస్తాన్ మాజీ బ్యాట‌ర్ ఉస్మాన్ ఘ‌ని క్రికెట్ చ‌రిత్ర‌లో కనివిని ఎరుగని రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒకే ఓవ‌ర్‌లో 45 ప‌రుగులు బాది వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఉస్మాన్ ఘనీ తన మాకంను లండన్‌కు మార్చాడు. ఈ క్రమంలో అక్కడ క్లబ్ క్రికెట్ జట్లుకు ఘనీ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఉస్మాన్ ప్రస్తుతం ఈసీఎస్ ఇంగ్లండ్ టీ10 టోర్నీలో లండన్ కౌంటీ క్రికెట్ జట్టు(LCC)కు సార‌థ్యం వ‌హిస్తున్నాడు.

5 సిక్స్‌లు, రెండు ఫోర్ల‌తో..
ఈ క్ర‌మంలో శుక్ర‌వారం రాత్రి రేన్స్ పార్క్ స్పోర్ట్స్ గ్రౌండ్ వేదిక‌గా ఎల్‌సీసీ, గిల్డ్‌ఫోర్డ్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈమ్యాచ్‌లోనే ఘ‌నీ అద్బుతం చేశాడు. ఎల్‌సీసీ ఇన్నింగ్స్ 8 ఓవ‌ర్ వేసిన గిల్డ్‌ఫోర్డ్ బౌలర్ విల్ ఎర్నీ బౌలింగ్‌లో ఘ‌నీ ఈ విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్‌లో తొలి బంతిని ఉస్మాన్ సిక్సర్‌గా మలిచాడు.

అయితే అంపైర్ నోబాల్‌గా ప్రకటించడం తొలి బంతి పడకుండానే 7 పరుగులు వచ్చాయి. అనంతరం మొదటి బంతి(ఫ్రీహిట్‌)కి ఘనీ సిక్సర్ బాదాడు. ఆ తర్వాత రెండో బంతిని బౌలర్ వైడ్‌గా సంధించాడు. ఆ బంతిని కీపర్ కూడా ఆపలేకపోడంతో అది బౌండరీ వెళ్లింది. దీంతో ఎక్స్‌ట్రాస్ రూపంలో ఐదు పరుగులు లభించాయి.

అనంతరం సరిగ్గా వేసిన రెండో బంతిని సదరు బ్యాటర్ సిక్సర్‌గా స్టండ్స్‌కు పంపాడు. దీంతో రెండు సరైన బంతులు వేసే సమయానికి సదరు బౌలర్ ఏకంగా 24 పరుగులిచ్చాడు. ఆ తర్వాత మూడో బంతిని మళ్లీ నోబాల్‌గా వేశాడు. ఆ బంతి కి బౌండరీ వచ్చింది. ఫ్రీహిట్ బంతిని ఉస్మాన్ సిక్సర్‌గా మలిచాడు.

నాలుగో బంతి డాట్ కాగా, ఐదో బంతికి సిక్స్‌, ఆరో బంతికి ఫోర్ వచ్చాయి. మొత్తంగా ఓవర్‌లో 45 పరుగులు వచ్చాయి. ఘని బ్యాట్ నుంచి 38 పరుగులు, ఎక్స్‌ట్రాల రూపంలో 7 ర‌న్స్ వ‌చ్చాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఒకే ఓవ‌ర్‌లో ఇన్ని ప‌రుగులు రాలేదు.

విధ్వంస‌క‌ర సెంచ‌రీ..
ఈ మ్యాచ్‌లో ఘ‌ని కేవ‌లం 28 బంతుల్లోనే సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవ‌రాల్‌గా 43 బంతులు ఎదుర్కొన్న ఈ అఫ్గానీ.. 355.81 స్ట్రైక్ రేట్‌తో 11 ఫోర్లు, 17 సిక్సర్లతో 153 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఫ‌లితంగా మొదట బ్యాటింగ్ చేసిన లండన్ కౌంటీ క్రికెట్ జట్టు 10 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 226 పరుగుల భారీ స్కోరు సాధించింది.
చదవండి: Asia Cup 2025: టీమిండియాకు భారీ షాక్‌..!?

అనంత‌రం ల‌క్ష్య చేధ‌న‌లో గిల్డ్‌ఫోర్డ్ జట్టు, 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేయ‌గల్గింది. దీంతో లండన్ కౌంటీ టీమ్‌ 71 పరుగుల తేడాతో ఘ‌న‌ విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement