US Open: చరిత్ర సృష్టించిన ఎమ్మా.. తొలిసారిగా ఫైనల్‌లో ఇద్దరూ..

US Open: Emma Raducanu Makes History Point That Changed Her Life - Sakshi

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌లో బ్రిటిష్‌ టెన్నిస్‌ ప్లేయర్‌, టీనేజర్‌ ఎమ్మా రెడుకాను సంచలనం సృష్టించింది. అత్యంత చిన్నవయస్సులోనే గ్రాండ్‌స్లామ్‌ వేటలో ఫైనల్‌కు చేరి సత్తా చాటింది. తద్వారా మారియా షరపోవా(17 ఏళ్ల వయసులో వింబుల్డన్‌ విజేత- 2004) తర్వాత ఏదేని ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో ఈ రికార్డు సాధించిన టీనేజర్‌గా గుర్తింపు దక్కించుకుంది.

కాగా గురువారం నాటి(స్థానిక కాలమానం ప్రకారం) సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో గ్రీస్‌ ప్లేయర్‌ మారియా సకారిని 6-1, 6-4 తేడాతో ఓడించి ఎమ్మా తుది పోరులో నిలిచింది.  వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో 150వ స్థానంలో ఉన్న ఆమె.. 18 ఏళ్ల వయస్సులోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఇక ఫైనల్‌లో మరో టీనేజర్‌, 19 ఏళ్ల కెనడా ప్లేయర్‌ లేలా ఫెర్నాండెజ్‌తో ఆమె తలపడనుంది. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా వెల్లడించిన యూఎస్‌ ఓపెన్‌ నిర్వాహకులు.. ‘‘ఆ ఒక్క పాయింట్‌ ఎమ్మా రెడుకాను జీవితాన్నే మార్చేసింది. మీరిప్పుడు యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో ఉన్నారు తెలుసా’’ అంటూ ఆమెను విష్‌ చేసింది.

తన అద్బుత విజయం గురించి ఎమ్మా మాట్లాడుతూ.. ‘‘నేను ఫైనల్‌ చేరుకున్నాను. అసలు నేనిది నమ్మలేకపోతున్నాను. నిజంగా నమ్మలేకపోతున్నాను. ఇది ఎవరైనా ఊహించారా? నేను ఇప్పుడు టెక్నికల్‌గా ఫైనల్‌లో ఉన్నాను. షాకింగ్‌గా, సంతోషంగా ఉంది’’ అంటూ భావోద్వేగానికి లోనైంది. ఇక 1999 తర్వాత ఇలా యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో ఇద్దరు టీనేజర్లు ఫైనల్‌లో తలపడటం ఇదే మొదటిసారి. గతంలో 17 ఏళ్ల సెరీనా విలియమ్స్‌, 18 ఏళ్ల మార్టినా హింగిస్‌ను ఓడించి టైటిల్‌ గెలిచింది. ఇక శనివారం ఎమ్మా, లేలా మధ్య ఆసక్తికపోరు జరుగనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top