ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్-2027కు సంబంధించి క్రేజీ అప్‌డేట్ అందింది. ఈ మెగా ఈవెంట్‌కు అక్టోబరు- నవంబరు మధ్య షెడ్యూల్ ఖరారైనట్లు సమాచారం. వచ్చే ఏడాది అక్టోబరు 4న మొదలై నవంబరు 21న ఫైనల్‌తో వన్డే వరల్డ్‌కప్ ముగియనున్నట్లు తెలుస్తోంది.
ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో కథనం ప్రకారం.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మేలో అహ్మదాబాద్‌లో సమావేశమైన సమయంలో వరల్డ్‌కప్ షెడ్యూల్ గురించి ప్రధానంగా చర్చ జరిగింది. ఈ మెగా ఈవెంట్‌కు సౌతాఫ్రికాతో పాటు జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.
అక్కడ ఎనిమిది వేదికలు
అయితే, ప్రధాన మ్యాచ్‌లనీ సౌతాఫ్రికాలోనే జరుగనున్నాయి. ఇందుకోసం ఎనిమిది వేదికలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈవెంట్లోని 54 మ్యాచ్‌లలో 41 మ్యాచ్‌లు సౌతాఫ్రికాలోనే నిర్వహిస్తారు. ఇక జింబాబ్వేకు 8- 10 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కగా.. నమీబియాలో కేవలం మూడు మ్యాచ్‌లే నిర్వహించనున్నట్లు సమాచారం.
కాగా సౌతాఫ్రికాలోని సెంచూరియన్, జొహన్నస్‌బర్గ్, బ్లోయేమ్‌ఫొంటేన్, డర్బన్, ఈస్ట్ లండన్, గెబెర్హ, పర్ల్, కేప్‌టౌన్‌లను వరల్డ్‌కప్ వేదికలుగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక జింబాబ్వేలో హరారే, క్వీన్స్, విక్టోరియా ఫాల్స్ ఆతిథ్య హక్కులు దక్కించుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్‌పై జూలైలో జరిగే సమావేశంలో పూర్తి స్పష్టత రానుంది.
24 ఏళ్ల తర్వాత
కాగా దాదాపు 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఆఫ్రికా ఖండంలో వన్డే వరల్డ్‌కప్ జరుగనుంది. చివరగా 2003లో సౌతాఫ్రికాలో ఈ టోర్నీ జరుగగా.. నాడు ఫైనల్లో టీమిండియాపై గెలిచి ఆస్ట్రేలియా విజేతగా అవతరించింది. ఇదిలా ఉంటే.. 2007లో తొలిసారి ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్ టోర్నీకి సౌతాఫ్రికానే ఆతిథ్యం ఇవ్వడం విశేషం.
చదవండి: భారత జట్టులోకి ద్రవిడ్ కుమారుడు


