Team India: ద్వైపాక్షిక సిరీస్‌ల్లో జోరు.. మెగా టోర్నీల్లో బేజారు

Team India Win Run Continues In Bilateral Series, But Failing In Mega Tourneys - Sakshi

రోహిత్‌ శర్మ పూర్తి స్థాయి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాక పొట్టి ఫార్మాట్‌ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో టీమిండియా అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆరంభం నుంచి భారత జట్టు.. ఆడిన ప్రతి సిరీస్‌లోనూ జయకేతనం ఎగురవేసి సత్తా చాటింది.

అయితే, మెగా టోర్నీల విషయానికి వస్తే మాత్రం టీమిండియా తేలిపోతుంది. ఒత్తిడి వల్లనో లేక కీలక ఆటగాళ్లు సమయానికి (కీలక టోర్నీలకు) అందుబాటులో లేకపోవడం వల్లనో.. కారణం ఏదైనా పెద్ద టోర్నీల్లో మాత్రం టీమిండియా దారుణంగా విఫలమవుతుంది.

ఇటీవలి కాలంలో టీమిండియా ఆడిన టీ20 సిరీస్‌లపై లుక్కేస్తే.. స్వదేశంలో వెస్టిండీస్‌ (3-0), శ్రీలంక (3-0)లను క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఆతర్వాత ఐర్లాండ్‌ పర్యటనలో 2-0 తేడాతో సిరీస్‌ గెలిచింది. ఆ వెంటనే ఇంగ్లండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

ఆతర్వాత కరీబియన్‌ గడ్డపై 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో, ఆ వెంటనే స్వదేశంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై 2-1 తేడాతో వరుస సిరీస్‌ విజయాలు సాధించింది. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇలా.. ఈ ఏడాది టీమిండియా ఆడిన 8 సిరీస్‌ల్లో వరుస విజయాలు సాధించి, ద్వైపాక్షిక సిరీస్‌ల్లో తిరుగులేని జట్టుగా నిలిచింది.

అయితే, టీమిండియా ఈ జోరును మెగా ఈవెంట్లలో మాత్రం చూపలేకపోతుంది. ఆగస్ట్‌, సెప్టెంబర్‌లలో జరిగిన ఆసియా కప్‌లో సూపర్‌-4లోనే నిష్క్రమణ, తాజాగా ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో సెమీస్‌లో ఓటమి.. ఇలా ఈ ఏడాది ఆడిన రెండు మేజర్‌ టోర్నీల్లో రిక్త హస్తాలతో వెనుదిరిగింది. ఆసియా కప్‌లో అయితే పాకిస్తాన్‌, శ్రీలంక చేతుల్లో దారుణ పరాభావాలు (సూపర్‌-4) ఎదుర్కొని ముప్పేట దాడిని ఎదుర్కొంది.

2021 టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఇదే పరిస్థితి ఏదురైంది. ఆ టోర్నీలో తొలి మ్యాచ్‌లోనే పాక్‌ చేతుల్లో ఓడి సూపర్‌-4కు కూడా అర్హత సాధించలేక పోయింది. ఇక తాజాగా ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో గ్రూప్‌ దశ సాఫీగా సాగిన టీమిండియా ప్రయాణం, సెమీస్‌కు వచ్చే సరికి ఆగిపోయింది. సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతుల్లో 10 వికెట్ల తేడాతో దారుణంగా ఓటమిపాలైంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top