
ప్రపంచ 15వ ర్యాంకర్‌పై గెలుపుతో క్వార్టర్ ఫైనల్లోకి
శ్రమించి నెగ్గిన సాత్విక్–చిరాగ్ జోడీ
మకావ్: అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న భారత షట్లర్, హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి తన కెరీర్‌లో గొప్ప విజయాన్ని అందుకున్నాడు. మకావ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో ప్రపంచ 47వ ర్యాంకర్ తరుణ్ సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తరుణ్ 19–21, 21–14, 22–20తో ప్రపంచ 15వ ర్యాంకర్, టాప్ సీడ్ లీ చెక్ యు (హాంకాంగ్)ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
60 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తరుణ్ తొలి గేమ్‌లో ఒకదశలో 7–1తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ అదే జోరును కొనసాగించలేకపోయాడు. తొలి గేమ్ చేజార్చుకున్నప్పటికీ ఆందోళనకు గురి కాకుండా సంయమనంతో ఆడిన తరుణ్ రెండో గేమ్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. హోరాహోరీగా సాగిన నిర్ణాయక మూడో గేమ్‌లు పలుమార్లు స్కోర్లు సమమయ్యాయి. ఒకదశలో 17–14తో ముందంజ వేసిన తరుణ్ ఆ తర్వాత తడబడి స్కోరును 20–20తో సమం చేసుకున్నాడు.
అయితే వెంటనే వరుసగా రెండు పాయింట్లు నెగ్గిన తరుణ్ చిరస్మరణీయ విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. భారత్‌కే చెందిన లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్ చేరగా... ఆయుశ్ శెట్టి నిష్క్రమించాడు. లక్ష్య సేన్ 21–14, 14–21, 21–17తో చికో వర్దోయో (ఇండోనేసియా)పై నెగ్గగా... ఆయుశ్ 18–21, 16–21తో జస్టిన్ హో (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రక్షిత శ్రీ (భారత్) 21–14, 10–21, 11–21తో బుసానన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. మిక్స్‌డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 21–19, 13–21, 18–21తో జిమ్మీ వోంగ్–లాయ్ పె జింగ్ (మలేసియా) జంట చేతిలో ఓటమి పాలైంది.
పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి (భారత్) జంట క్వార్టర్ ఫైనల్ చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ 10–21, 22–20, 21–16తో కకేరు కుమగాయ్–హిరోకి నిషి (జపాన్)లపై గెలిచింది. 61 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయిన భారత జోడీ రెండో గేమ్‌లో 19–20తో ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే పట్టుదలతో పోరాడి వరుసగా మూడు పాయింట్లు నెగ్గిన భారత ద్వయం రెండో గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో ఆరంభంలోనే 4–0తో ముందంజ వేసిన సాత్విక్–చిరాగ్ చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని అందుకుంది.