
Lance Klusner on India-Pakistan T20 WC clash: దాయాది జట్లు టీమిండియా- పాకిస్తాన్ టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో తలపడబోయే రోజు కోసం క్రీడాభిమానులు సహా విశ్లేషకులు, మాజీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతీ ఐసీసీ ఈవెంట్‌లో వలె ఈసారి కూడా పాక్‌పై మెన్ ఇన్ బ్లూ విజయపరంపర కొనసగుతుందా? లేదంటే మెన్ ఇన్ గ్రీన్ తమ అపజయాల పర్వానికి అడ్డుకట్ట వేయగలుగుతుందా? అన్న విషయాల గురించి జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్, అఫ్గనిస్తాన్ కోచ్ లాన్స్ క్లూసెనర్ అక్టోబరు 24 నాటి మ్యాచ్ ఫలితం గురించి తన అభిప్రాయం పంచుకున్నాడు.
పాకిస్తాన్‌ను ఓడించేందుకు కోహ్లి సేన అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉందని.. అయితే, తమదైన రోజున పాక్ చెలరేగి ఆడుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నాడు. ఈ మేరకు... క్లూసెనర్ మాట్లాడుతూ... ‘‘భారత్, పాకిస్తాన్.. రెండూ బలమైన జట్లు. వాటి మధ్య మ్యాచ్ ఎల్లప్పుడూ ఆసక్తికరం. ముఖ్యంగా వరల్డ్‌కప్ వంటి పెద్ద ఈవెంట్లలో ఇరు జట్లు తలపడినపుడు అది మరింత ఇంట్రస్టింగ్‌గా మారుతుంది. పాకిస్తాన్‌లో ప్రస్తుతం అత్యుత్తమ బ్యాటర్లు ఉన్నారు. బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే ఉంది.
విరాట్ కోహ్లి బృందం దగ్గర వాళ్లను ఓడించడానికి కావాల్సిన దానికంటే.. ఎక్కువే ‘అస్త్రాలు’ ఉన్నాయి. కానీ.. టీమిండియా ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా... పాకిస్తాన్ చేతిలో భంగపాటు తప్పదు. తనదైన రోజున ప్రపంచంలోని ఏ జట్టునైనా పాక్ ఓడించగలదు’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. ఇక అఫ్గనిస్తాన్ గురించి క్లూసెనర్ మాట్లాడుతూ...‘‘ర్యాంకింగ్స్‌లో మేం మరింత మెరుగుపడాలంటే.. ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్ వంటి జట్లతో జరిగే మ్యాచ్‌లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచగలగాలి. శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం’’ అని చెప్పుకొచ్చాడు.
చదవండి: Aakash Chopra: ఈరోజు మీ కథ ముగుస్తుంది.. ఆ జట్టుదే విజయం