T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్‌ | Sakshi
Sakshi News home page

T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్‌

Published Sun, May 19 2024 2:59 PM

T20 WC 2024 Trophy Tour: Piyush Chawla Unveil Trophy At Sakshi Media Office Hyd

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఆటల్లో క్రికెట్‌ ఒకటి. బ్రిటిష్‌ నేలకు ఒకప్పుడు అది వేసవి క్రీడ. క్రమంగా ఆదరణ చురగొని ‘జెంటిల్మెన్‌ గేమ్’గా అన్ని దేశాలకు విస్తరించింది(ఇలా ఎందుకు పిలుస్తారో చివర్లో చెబుతాం). ఇప్పుడు.. కోట్ల మందికి వినోదాన్ని పంచే విశ్వక్రీడ ఇది. 

ఇందులోనే ప్రధాన టోర్నీలను కైవసం చేసుకునేందుకు పలు జట్లు పోటీ పడుతుంటాయి. ఇందులో ఒకటే టీ 20 ప్రపంచకప్‌. స్టేడియంలో సీటుల్లో కూర్చోనివ్వకుండా వేల మందిని.. స్మార్ట్‌తెరలకు అతుక్కుపోయేలా కోట్లమందిని అలరించేందుకు.. మస్త్‌  మజా టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీ మరోసారి వచ్చేస్తోంది.

‘‘హాయ్‌.. నా పేరు పొట్టోడు. క్రికెట్‌కు పుట్టిన ముగ్గురం పిల్లల్లం మేం. పెద్ద కొడుకు..  నా అన్న టెస్టు‌. రెండో కొడుకు.. నా చిన్నన్న వన్డే. ఇంక నేనేమో చిన్నోడిని.. పేరు టీ20. ఎంతైనా ఫార్మట్‌ చిన్నది కదా!. అందుకే అంతా ముద్దుగా నన్ను పొట్టోడు అంటారు. నా కోసం కూడా ఓ మహా సంగ్రామం జరుగుతుంటుంది. 

ఆ సంబురం పంచేందుకు మరో రెండు వారాల్లో మళ్లీ మీ ముందుకు వస్తున్నా. నన్ను గెలవడమే లక్ష్యంగా పెట్టుకుని 20 దేశాల జట్లు సమరం తలపడబోతున్నాయి. అందుకే నా గురించి మీతో కొన్ని ముచ్చట్లు పంచుకునేందుకు వచ్చా.  

క్రికెట్‌కు పెద్దన్నగా వ్యవహరించే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ఆధ్వర్యంలో నా కోసం ఈ టీ20 ప్రపంచ కప్‌ జరుగుతుంది. తుది సమరంలో నెగ్గిన జట్టుకే నన్ను బహుకరిస్తారు. లండన్‌లోని లింక్స్‌ లండన్‌ కంపెనీ వాళ్లు నన్ను తయారు చేస్తున్నారు. 

సిల్వర్‌-రోడియం కలయికతో ఏడున్నర కేజీల బరువు ఉంటా నేను. ఇప్పటి వరకు 8 సార్లు టోర్నీ నిర్వహిస్తే.. రెండు జట్లు(ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌) రెండేసిసార్లు నన్ను గెల్చుకున్నాయి. మిగతా నాలుగు సార్లు నాలుగు జట్లు గెలిచాయి. 

ఆస్ట్రేలియా తప్పించి ఇందులో మూడు ఆసియా దేశాలే ఉన్నాయి. అయితే.. 2007లో తొలిసారి దక్షిణాఫ్రికా ఆతిథ్యంలో నా కోసం తొలి టోర్నీ జరిగితే.. ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ ఉత్కంఠభరిత విక్టరీతో నన్ను కైవసం చేసుకుంది. అప్పటి నుంచి ప్రతీ టోర్నీలోనూ నా కోసం టఫ్‌ ఫైట్‌ జరుగుతూనే వస్తోంది.

గెలిచిన జట్టుకు ఐసీసీ కేవలం నా టోర్నీని మాత్రమే చేతులో పెట్టదు. ప్రైజ్‌మనీ కూడా ఉంటుంది. గత టోర్నీలో గెలిచిన ఇంగ్లండ్‌ జట్టుకు 1.6 మిలియన్‌ డాలర్ల(సుమారు రూ.13 కోట్లు) ప్రైజ్‌మనీ ఇచ్చారు. రన్నరప్‌గా నిలిచిన పాక్‌కు 8,00,000 డాలర్లు ఇచ్చారు. 

కేవలం విన్నర్‌ రన్నర్‌ మాత్రమే కాదు.. టోర్నీలో పాల్గొనే మిగతా జట్లకు కూడా వాళ్ల వాళ్ల ఫర్‌ఫార్మెన్స్‌ను బట్టి రివార్డు ఇస్తారు. అలా కిందటి సీజన్‌లో మొత్తం 5.6 మిలియన్‌ డాలర్లను(రూ46 కోట్ల పైనే) 16 జట్లకు పంచారు. మరి ఈసారి 20 జట్లు కదా. ఆ ప్రైజ్‌ మనీని పెంచుతారేమో!.

నేనిప్పుడు భారత్‌లోనే ఉన్నా.వహ్‌.. ఈ దేశం ఇస్తున్న ఆతిథ్యం అంతా ఇంతా కాదు. ఈసారి ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. నేనే కాదు సగటు భారతీయ అభిమానులు.. నన్ను ఎలాగైనా దక్కించుకుని దాదాపు 11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు ఈసారైనా ముగింపు పలికాలని  కోరుకుంటున్నారు.

జూన్ 2 నుంచి టీ20 ప్రపంచ కప్‌ టోర్నీ ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్‌ నెదర్లాండ్‌ లాంటి చిన్నజట్టుతో అయినా.. జూన్ 9న పాకిస్థాన్‌తో గ్రూప్‌ స్టేజ్‌లో టీమ్‌ఇండియా తలపడనుంది. అయితే, ఆ ఒక్కసారే కాకుండా టైటిల్‌ పోరు దాయాదుల మధ్యే జరగాలని.. ఆ మ్యాచ్‌ వీక్షిస్తే అద్భుతంగా ఉంటుందేమో కదా!.

చివరిసారిగా 2013లో ధోనీ నాయకత్వంలో ఛాంపియన్స్‌ ట్రోఫీని భారత జట్టు కైవసం చేసుకుందట. గతేడాది వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరినప్పటికీ ప్చ్‌.. కప్‌ను అందుకోలేకపోయిందట. అందుకే ఈసారి నన్ను ఎలాగైనా దక్కించుకోవాలని భారత జట్టు సన్నద్ధం అయ్యింది. మిగతా జట్లకు చెప్పినట్లే టీమిండియాకు కూడా ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నాం.

అన్నట్లు.. ఈరోజు పీయూష్‌ చావ్లాతో కలిసి తెలుగు మీడియా సంస్థ సాక్షి ఆఫీస్‌కు వచ్చా ఇవాళ. ఇక్కడ నన్ను చూసేందుకు ఉద్యోగులు ఉత్సాహం ప్రదర్శించారు. నాతో సెల్ఫీలు దిగారు. నన్ను తీసుకొచ్చిన వాళ్లతో సరదాగా ముచ్చటించారు. సాక్షిలో గడిపిన కాసేపు క్షణాలు ఎంతో బాగున్నాయి.


C- కస్టమర్ ఫోకస్ (వినియోగదారునిపై దృష్టి)
R - రెస్పెక్ట్ ఫర్ ఇండివిడ్యువల్ (ప్రతీ వ్యక్తికీ గౌరవం)
I- ఇంటిగ్రిటీ (సమగ్రత)
C- కమ్యూనిటీ కంట్రిబ్యూషన్ (సామాజిక సహకారం)
K- నాలెడ్జ్ వర్షిప్ (జ్ఞాన ఆరాధన)
E-ఎంట్రప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ (వ్యవస్థాపకత మరియు ఆవిష్కరణ)
T- టీమ్‌వర్క్

క్రికెట్‌లోని ప్రతీ అక్షరానికి ఒక అర్థం ఉంది. ఈ లక్షణాలన్నీ హుందాతనం కలిగిన వాళ్లలో కనిపిస్తాయి. అందుకే క్రికెట్‌ను జెంటిల్‌మన్ గేమ్ అంటారు.

Advertisement
 
Advertisement
 
Advertisement