T20 WC 2022: ఒక్క మ్యాచ్‌తో అంతా తారుమారు.. వారి దురదృష్టం పాక్‌కు అదృష్టం! వాళ్ల వల్లే

T20 WC 2022: Factors That Helped Pakistan To Qualify For Semi Finals - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022 సంచలనాలకు కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. టోర్నీ మొదటి మ్యాచ్‌తో (శ్రీలంకపై నమీబియా విజయం) మొదలైన సంచనాల పరంపర.. ఇవాల్టి (నవంబర్‌ 6) సౌతాఫ్రికా-నెదర్లాండ్స్‌ మ్యాచ్‌ వరకు అప్రతిహతంగా కొనసాగింది. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో పసికూన నెదర్లాండ్స్‌ సంచలన విజయం సాధించింది. 

ఈ ఒక్క మ్యాచ్‌తో గ్రూప్‌-2 సెమీస్‌ బెర్త్‌లు ఒక్కసారిగా తారుమారయ్యాయి. సౌతాఫ్రికా ఓటమితో టీమిండియా.. జింబాబ్వేతో జరుగబోయే మ్యాచ్‌తో సంబంధం లేకుండా సెమీస్‌కు చేరుకోగా, రెండో బెర్తు కోసం జరిగిన పోటీలో పాక్‌.. బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి సెమీస్‌కు అర్హత సాధించింది. 

ఈ మ్యాచ్‌కు ముందు వరకు సెమీస్‌ బెర్త్‌పై ఆశలు దాదాపుగా వదులుకున్న పాక్‌.. నెదర్లాండ్స్‌ చేతిలో సౌతాఫ్రికా ఓటమితో తిరిగి జీవం పోసుకుని బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి సెమీస్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో ఒకవేళ బంగ్లాదేశ్‌ గెలిచి ఉంటే.. భారత్‌తో పాటు ఆ జట్టే సెమీస్‌కు చేరేది. అయితే అనూహ్యంగా సెమీస్‌ రేసులోకి వచ్చిన బంగ్లాదేశ్‌ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది.

మరోపక్క ఈ మారిన సమీకరణలకు ముఖ్య కారణమైన సౌతాఫ్రికాపై క్రికెట్‌ అభిమానులు జాలి చూపిస్తుండగా.. పాక్‌ అభిమానులు మాత్రం తమ పాలిట అదృష్టంగా నిలిచిన ప్రొటీస్‌కు థ్యాంక్స్‌ చెబుతున్నారు. పాక్‌ ఫ్యాన్స్‌.. తమ జట్టు సెమీస్‌ చేరంగానే వరల్డ్‌కప్‌ గెలిచినంత హడావుడి చేస్తున్నారు. సోషల్‌మీడియాలో పాక్‌ అభిమానులు చేస్తున్న హల్‌చల్‌కు భారత ఫ్యాన్స్‌ తగు రీతిలో రెస్పాండ్‌ అవుతున్నారు. ఇప్పుడేముంది.. ముందుంది ముసళ్ల పండుగ అంటూ పాక్‌ను హెచ్చరిస్తున్నారు. ఒకవేళ నెదర్లాండ్స్‌పై సౌతాఫ్రికా గెలిచి ఉంటే, మీరు ఈపాటికి పెట్టా బేడా సర్దుకోవాల్సి వచ్చేదని సెటైర్లు వేస్తున్నారు.

ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. ఓపెనర్‌ షాంటో (54) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 127 పరుగుల నామమాత్రపు స్కోర్‌ చేసింది. షాహీన్‌ అఫ్రిది 4 వికెట్లు పడగొట్టి బంగ్లాను దారుణంగా దెబ్బకొట్టాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌.. మహ్మద్‌ రిజ్వాన్‌ (32), బాబర్‌ ఆజమ్‌ (25), మహ్మద్‌ హరీస్ (31), షాన్‌ మసూద్‌ (24 నాటౌట్‌)లు ఓ మోస్తరుగా రాణించడంతో 18.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా 5 వికెట్ల తేడాతో గెలుపొంది, సెమీస్‌కు అర్హత సాధించింది.   

 

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top