టీమిండియా టీ20 కెప్టెన్ మార్పు విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సూర్యకుమార్ యాదవ్‌కు మరికొన్నాళ్లు సమయం ఇవ్వాలని తొలుత భావించినప్పటికీ.. ఇప్పుడు బోర్డు ఆ ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం.
అగ్రపథంలో నిలిపి.. ప్రపంచకప్ అందించి
కాగా గత రెండేళ్లుగా టీ20లలో సారథిగా భారత్‌ను అగ్రపథంలో నిలిపాడు సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav). ఈ ఏడాది సొంతగడ్డపై ప్రపంచకప్ టోర్నీలో చాంపియన్‌గా నిలిపి.. దిగ్గజ కెప్టెన్ల సరసన చేరాడు. అయితే, ఒకప్పుడు ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్న సూర్య.. కెప్టెన్ అయిన తర్వాత పూర్తిగా తేలిపోయాడు.
ఈ నేపథ్యంలో 35 ఏళ్లపై సూర్యను కెప్టెన్సీ నుంచి తొలగించేందుకు నాయకత్వ బృందం సిద్ధమైంది. అయితే, ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో అతడి ప్రదర్శన చూసిన తర్వాతే తుది నిర్ణయానికి రావాలని భావించింది. తాజాగా ఈ విషయంలో యూటర్న్ తీసుకున్నట్లు సమాచారం.
ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన సూర్య దారుణ వైఫల్యమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ సీజన్లో పదమూడు ఇన్నింగ్స్ ఆడిన సూర్య కేవలం 270 పరుగులే చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 60.
ఐర్లాండ్ పర్యటన నుంచే కొత్త కెప్టెన్
ఈ నేపథ్యంలో సూర్యను తక్షణమే కెప్టెన్సీ నుంచి తప్పించాలని బీసీసీఐ నిర్ణయానికి వచ్చినట్లు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో తెలిపింది. ఐర్లాండ్ పర్యటన నుంచే కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ముంబైలో శనివారం జరిగే సెలక్షన్ ప్యానెల్ సమావేశంలో అతడి పేరును అధికారికంగా ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో సిరీస్ తర్వాత టీమిండియా యూకేకు పయనం కానుంది.
యూకే టూర్ సాగుతుందిలా..
ఇందులో భాగంగా తొలుత జూన్ 26, 28 తేదీల్లో బెల్‌ఫాస్ట్ వేదికగా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనున్న టీమిండియా.. తదుపరి జూలై 1 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లలో పాల్గొంటుంది. అనంతరం సెప్టెంబరు- అక్టోబరు మధ్య జపాన్ వేదికగా ఆసియా క్రీడల్లో భాగమవుతుంది.

వైస్ కెప్టెన్‌గా తిలక్!
ఇదిలా ఉంటే.. సూర్యను కెప్టెన్‌గా తొలగించడంతో పాటు.. జట్టు నుంచి కూడా అతడిని తప్పించే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు పీటీఐ బుధవారం వెల్లడించింది. శ్రేయస్ అయ్యర్‌కు డిప్యూటీగా హైదరాబాదీ తిలక్ వర్మను నియమించనున్నట్లు పేర్కొంది. అదే విధంగా.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో సెలక్టర్లు చోటు ఇవ్వనున్నట్లు సదరు వార్తా సంస్థ తెలిపింది.
కెప్టెన్‌గా పునరాగమనం!
కాగా 2023లో చివరగా టీమిండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు శ్రేయస్ అయ్యర్. ఇక ఐపీఎల్-2024లో సారథిగా కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన ఈ ముంబైకర్.. 2025లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చాడు. అయితే, ఈ ఏడాది మాత్రం ప్లే ఆఫ్స్ వరకు కూడా తీసుకువెళ్లలేకపోయాడు.
ఓవరాల్‌గా గత మూడేళ్లలో ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మద్దతుతో అతడు భారత టీ20 జట్టులో దాదాపు మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వడమే కాకుండా.. ఏకంగా కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం కావడం విశేషం.


