
ధోని- రైనా (Photo Courtesy: BCCI)
ఐపీఎల్-2025 (IPL 2025)లో చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni)కి వరుస చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇటు సారథిగా.. అటు బ్యాటర్‌గా తలా విఫలమవుతున్నాడు. మరోవైపు.. జట్టు పరిస్థితి కూడా దారుణంగా ఉంది.
ఐదు మ్యాచ్‌ల తర్వాత రెగ్యులర్ కెప్టెన్ రుత్‌రాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) గాయం వల్ల సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో మరోసారి ధోని బాధ్యతలు చేపట్టాడు. కానీ అతడి సారథ్యంలోనూ కనీవినీ ఎరుగని రీతిలో కంచుకోట చెపాక్‌లో చెన్నై వరుస ఓటములు చవిచూసింది.
అంతేకాదు.. ఈ ఏడాది ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. ఇక గతేడాది కూడా సీఎస్‌కే ఇలాగే టాప్-4కు చేరకుండానే అవుటైన విషయం తెలిసిందే. వరుసగా ఇలా రెండు సీజన్లలో ప్లే ఆఫ్స్ చేరకపోవడం చెన్నై చరిత్రలోనే తొలిసారి ఇది.
వారిని వదిలించుకోండి
ఈ నేపథ్యంలో సీఎస్‌కే మెగా వేలం-2025లో అనుసరించిన వ్యూహాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రవిచంద్రన్ అశ్విన్, విజయ్ శంకర్ తదితరులను వదిలించుకుంటేనే చెన్నై జట్టు బాగుపడుతుందని వీరేందర్ సెహ్వాగ్ వంటి మేటి క్రికెటర్లు యాజమాన్యానికి సూచిస్తున్నారు.
ధోని రిటైర్ అయితే బెటర్
మరోవైపు.. వికెట్ కీపర్‌గా రాణిస్తున్నా.. బ్యాటర్‌గా విఫలమవుతున్న ధోని ఇక రిటైర్ పోవాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. ఈ సీజన్‌లో తలా ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లలో కలిపి 163 పరుగులు మాత్రమే చేయగలిగాడు. స్ట్రైక్‌రేటు 148.18.
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఇక ధోని కనిపించకపోవచ్చన్న అభిప్రాయాల నడుమ.. టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై చిన్న తలా సురేశ్ రైనా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
సురేశ్ రైనా ‘షాకింగ్’ కామెంట్
ఇటీవల ఫిల్మీజ్ఞాన్ షోలో పాల్గొన్న సురేశ్ రైనాకు.. ‘ధోని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్‌గా ఎవరుంటారు?’ అన్న ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘నిజం చెప్పాలంటే నాకూ తెలియదు. ఎందుకంటే.. ఎంఎస్ ధోని ఇంకో రెండేళ్ల పాటు సీఎస్‌కేకు ఆడతాడు’’ అంటూ అభిమానుకుల షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్ ఇచ్చాడు రైనా.
కాగా ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లలో కేవలం రెండు గెలిచి.. ఏకంగా తొమ్మిది ఓడిపోయింది. నాలుగు పాయింట్లతో పట్టికలో అట్టడుగున పదో స్థానంలో కొనసాగుతోంది.
ఇక 43 ఏళ్ల ధోని విషయానికొస్తే.. ఐపీఎల్‌లో 275 మ్యాచ్‌లు ఆడి 5406 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 24 అర్ధ శతకాలు ఉన్నాయి. మరోవైపు 38 ఏళ్ల సురేశ్ రైనా కూడా గతంలో చెన్నైకి ఆడిన విషయం తెలిసిందే. ఓవరాల్‌గా క్యాష్ రిచ్ లీగ్‌లో 205 మ్యాచ్‌లు ఆడి 5528 రన్స్ సాధించి.. మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందాడు.
చదవండి: SRH Vs DC: ‘హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్’!.. కావ్యా మారన్ రియాక్షన్ వైరల్