
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు గెలిచి సిరీస్‌ను 3-1 సొంతం చేసుకోవాలని భావించిన ఇంగ్లండ్ జట్టుకు టీమిండియా ఝులక్ ఇచ్చింది.
ఆ మ్యాచ్‌ను భారత జట్టు తమ విరోచిత పోరాటంతో డ్రా ముగించింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య ఆఖరి టెస్టు జూలై 31 నుంచి లండన్‌లోని ఓవెల్ మైదానం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఇంగ్లండ్ భావిస్తుంటే.. భారత్ మాత్రం ప్రత్యర్ధిని ఓడించి సిరీస్ సమం చేయాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ టీమ్‌మెనెజ్‌మెంట్‌కు ఆ దేశ మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ కీలక సూచన చేశాడు. ఓవెల్ టెస్టులో జోఫ్రా ఆర్చర్‌కు బదులుగా గాస్ అట్కినసన్‌ను ఆడించాలని బ్రాడ్ అభిప్రాయపడ్డాడు.
"ఐదో టెస్టుకు జోఫ్రా ఆర్చర్‌కు విశ్రాంతి ఇవ్వాలి. అతడి స్ధానంలో గస్ అట్కిన్సన్ ఆడించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అతడిపై పస్తుతం ఎటువంటి వర్క్‌లోడ్ లేదు. ఆఖరి టెస్టులో అతడిని ఖచ్చితంగా ఆడించాలి. అట్కిన్సన్ టెస్టు క్రికెట్‌లో ఇప్పటివరకు సరైన ప్రత్యర్ధిని ఎదుర్కొలేదు.
అదేవిధంగా బ్రైడన్ కార్స్ కూడా బాగా ఆలిసిపోయాడు. నాలుగో టెస్టులో అతడు అంత కంఫర్ట్‌గా కన్పించలేదు. కానీ ఈ సిరీస్‌లో అతడు అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. కార్స్‌కు విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో టీమ్‌మెనెజ్‌మెంట్ ఉండొచ్చు.
ఒకవేళ అదే జరిగితే అట్కినసన్ జట్టులోకి రావడం ఖాయం. జోష్ టంగ్ రూపంలో కూడా మరో ఆప్షన్ ఉంది. అతడు తొలి టెస్టులో మాత్రమే ఆడాడు. టంగ్ భారత లోయర్ ఆర్డర్ ఆటగాళ్లను ఔట్ చేసి వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ అతడికి అద్బుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. కాబట్టి ఆర్చర్‌కు ప్రత్యామ్నాయంగా టంగ్‌ను కూడా జట్టులోకి తీసుకొవచ్చు" అని స్కై స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రాడ్ పేర్కొన్నాడు.