#CycloneMichuang: నా చెన్నై.. సేఫ్‌గా ఉండు! లంక యువ పేసర్‌ పోస్ట్‌ వైరల్‌

Stay Safe My Chennai CSK Matheesha Pathirana React to Cyclone Michaung - Sakshi

#Cyclone Michaung- #ChennaiFloods: ‘‘నా చెన్నై.. సురక్షితంగా ఉండు’’ అంటూ శ్రీలంక యువ క్రికెటర్‌ మతీశ పతిరణ తమిళనాడు పట్ల అభిమానం చాటుకున్నాడు. తుపాను ఎంతగా భయపెట్టినా.. తిరిగి కోలుకోగలమనే నమ్మకం కూడా అంతే బలంగా ఉండాలని ధైర్యం చెప్పాడు. కాగా తమిళనాడు రాజధాని చెన్నైని వరద నీరు ముంచెత్తుతోంది. 

మిచౌంగ్‌ తుపాను ప్రభావం వల్ల కురుస్తున్న భారీ వర్షాలకు నగరం అతలాకుతలమవుతోంది. వాన బీభత్సానికి చెన్నైలోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. 

చెన్నై ఎయిర్‌పోర్టు రన్‌వే పైకి వరద నీరు చేరడంతో ఇప్పటికే పలు విమాన సర్వీసులను నిలిపివేశారు. అదే విధంగా ఇప్పటికే పదకొండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా రద్దు చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగి అవసరార్థులకు సాయం చేస్తున్నాయి.

ఈ క్రమంలో.. తుపాను ప్రభావం వల్ల రానున్న 24 గంటల పాటు ఇలాగే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో క్రికెటర్లు చెన్నై ప్రజల కోసం తాము ప్రార్థిస్తున్నామంటూ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.

మిచాంగ్‌ బీభత్సం.. స్పందించిన డీకే, అశూ
టీమిండియా వెటరన్‌ బ్యాటర్‌, తమిళనాడు వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘నా చెన్నై స్నేహితులారా.. సురక్షితంగా ఉండండి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకండి. ఇలాంటి విపత్కర సమయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

ఆపత్కాలంలో ప్రజలకు అండగా ఉంటూ... పరిస్థితులు చక్కదిద్దుతున్న అధికారులకు సెల్యూట్‌. ఇలాంటపుడే ప్రతి ఒక్కరం పరస్పరం సహాయం చేసుకుంటూ ఒకరి కోసం ఒకరం బతకాలి’’ అని ట్వీట్‌ చేశాడు.

ఇక టీమిండియా వెటరన్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సైతం.. భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి విజ్ఞప్తి చేశాడు. వీరితో పాటు శ్రీలంక యువ పేసర్‌ మతీశ పతిరణ కూడా చెన్నై ప్రజలను ఉద్దేశించి ట్వీట్‌ చేశాడు.

‘‘సురక్షితంగా ఉండు నా చెన్నై!! తుపాను భయంకరమైనదే కావొచ్చు.. కానీ మన మనోబలం అంతకంటే గొప్పది. పరిస్థితులు తప్పక చక్కబడతాయి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. ఇంట్లోనే ఉండిపోండి. ఒకరికొకరు సహాయంగా ఉండండి’’ అని పతిరణ చెన్నై వాసులకు విజ్ఞప్తి చేశాడు.

ధోనికి ప్రియమైన బౌలర్‌
కాగా శ్రీలంకకు చెందిన రైటార్మ్‌ పేసర్‌ మతీశ పతిరణ.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సీఎస్‌కే కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ప్రియ ఆటగాడిగా 20 ఏళ్ల ఈ ఫాస్ట్‌బౌలర్‌ పేరు సంపాదించాడు. ఐపీఎల్‌-2023 సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు తీశాడు. చెన్నై ఐదోసారి చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. వచ్చే ఎడిషన్‌కు గానూ.. పతిరణను సీఎస్‌కే రిటైన్‌ చేసుకుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top