నీకు రూ. 20.50 కోట్లు... నాకు రూ. 24.75 కోట్లు  | Sakshi
Sakshi News home page

నీకు రూ. 20.50 కోట్లు... నాకు రూ. 24.75 కోట్లు 

Published Wed, Dec 20 2023 4:15 AM

Starc and Cummins set new records in IPL auction - Sakshi

ఐపీఎల్‌ వేలం షురూ... ముందుగా బ్యాటర్ల జాబితా... అది ముగిసిన తర్వాత రెండో సెట్‌ క్యాప్డ్‌ బౌలర్ల జాబితా ముందుకు వచ్చింది... నాలుగో ఆటగాడిగా ప్యాట్‌ కమిన్స్‌ పేరు వినిపించింది... రూ.2 కోట్ల కనీస విలువతో వేలం మొదలైంది... చెన్నై సూపర్‌ కింగ్స్, ముంబై ఇండియన్స్‌ ముందుగా పోటీ పడగా, ఆపై రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) వచ్చి చేరింది.

రూ.7.80 కోట్ల వద్ద సన్‌రైజర్స్‌ బరిలోకి దిగింది.. ఆపై మిగతా జట్లు తప్పుకోగా... రైజర్స్, ఆర్‌సీబీ మాత్రమే వేలం మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లాయి... రూ.20.25 కోట్ల వద్ద రెండు టీమ్‌లు ఆగాయి... దానికి మరో రూ.25 లక్షలు సన్‌రైజర్స్‌ జోడించాక బెంగళూరు స్పందించలేదు. రూ.20.50 కోట్లతో కమిన్స్‌ హైదరాబాద్‌ చెంత చేరడంతో ఐపీఎల్‌లో కొత్త రికార్డు నమోదైంది. 

కానీ సినిమా అంతటితో ముగిసిపోలేదు... గంట సేపటి తర్వాత మిచెల్‌ స్టార్క్‌ పేరు వేలంలోకి వచ్చింది... ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్‌ మొదలు పెట్టింది. ఆపై ముంబై, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) సీన్‌లోకి వచ్చేశాయి. కోల్‌కతా, గుజరాత్‌ టైటాన్స్‌ పోటీ పడి స్టార్క్‌ విలువను రూ.20 కోట్లు దాటించేశాయి... అయినా ఇరు జట్లు వెనక్కి తగ్గలేదు.

ఆసీస్‌ పేసర్‌ కోసం పోటీని కొనసాగించాయి... మరింత వేగంగా ఈ మొత్తం రూ.24.50 కోట్లకు చేరింది... ఈ దశలో కోల్‌కతా మరో అడుగు ముందుకేసింది... గుజరాత్‌ ఇక చాలనుకుకోవడంతో రూ.24.75 కోట్లతో స్టార్క్‌ తన సహచరుడు కమిన్స్‌ రికార్డును కొద్ది సేపటికే బద్దలు కొట్టేశాడు. ఇద్దరు స్టార్‌ ఆసీస్‌ పేసర్లు కలిసి ఐపీఎల్‌ ద్వారా రూ. 45.25 కోట్లతో పండగ చేసుకున్నారు! 

ఐపీఎల్‌ వేలం ఎప్పటిలాగే అంచనాలకు భిన్నంగా ఊహించని రీతిలో సాగింది. పేరుకే మినీ వేలం అయినా ఆటగాళ్లకు లభించిన మొత్తాలు మెగా వేలంలా అనిపించాయి. పెద్దగా గుర్తింపు లేని, టి20 ఫార్మాట్‌లో అంతగా అద్భుతాలు చూపించని ఆటగాళ్లపై కూడా కాసుల వాన కురవగా, ఇప్పటికే తమ ఆటతో సత్తా నిరూపించుకున్న కొందరికి ఆశ్చర్యకరంగా తక్కువ విలువే దక్కింది.

వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ట్రవిస్‌ హెడ్, న్యూజిలాండ్‌ ప్లేయర్‌ డరైల్‌ మిచెల్, విండీస్‌ పేసర్‌ అల్జారీ జోసెఫ్, హరియాణా బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ భారీ సొమ్మును తమ ఖాతాలో వేసుకోగా... అన్‌క్యాప్డ్‌ భారత ఆటగాడు సమీర్‌ రిజ్వీ (ఉత్తరప్రదేశ్‌), కుమార్‌ కుశాగ్ర (జార్ఖండ్‌) భారీ విలువ పలికి సంచలనం సృష్టించడం వేలంలో హైలైట్‌.   

72 మంది ఆటగాళ్లతో...
దుబాయ్‌: ఐపీఎల్‌–2024 కోసం మంగళవారం జరిగిన వేలం ముగిసింది. మొత్తం 332 మంది ఆటగాళ్లు వేలంలో అందుబాటులోకి రాగా... 10 ఫ్రాంచైజీలు కలిసి 72 మందిని ఎంచుకున్నాయి. ఇందులో 30 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వేలంలో గరిష్టంగా 77 మందిని తీసుకునే అవకాశం ఉన్నా... కోల్‌కతాలో 2 ఖాళీలు, రాజస్తాన్‌లో 3 ఖాళీలు ఉండిపోయాయి. తొలిసారి విదేశీ గడ్డపై జరిగిన ఐపీఎల్‌ వేలంను మొదటిసారి ఓ మహిళ (మల్లిక సాగర్‌) నిర్వహించడం విశేషం.

మధ్యాహ్నం 1 గంటకు మొదలైన వేలం స్వల్ప విరామాలతో రాత్రి 9 గంటల వరకు సాగింది. ఈ వేలం కోసం అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ.230 కోట్ల 45 లక్షలు వెచ్చించాయి. ఆసీస్‌ పేస్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ రూ. 24.75 కోట్లతో కొత్త రికార్డు నెలకొల్పగా... 24 మంది క్రికెటర్లను కనీస విలువ రూ.20 లక్షలతో జట్లు సొంతం చేసుకున్నాయి. వచ్చే సీజన్‌ ఐపీఎల్‌ మార్చి 22 నుంచి మే 26 జరిగే అవకాశం ఉంది.   

ఐపీఎల్‌ వేలం విశేషాలు...
♦ విండీస్‌ ప్లేయర్‌ రావ్‌మన్‌ పావెల్‌ కోసం రాజస్తాన్‌ భారీ మొత్తం (రూ.7.40 కోట్లు) వెచ్చించింది. గతంలో ఢిల్లీ తరఫున ఏమాత్రం ప్రభావం చూపలేకపోయినా... కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తమ జట్టు బార్బడోస్‌ రాయల్స్‌కు అతను కెపె్టన్‌ కావడమే ప్రధాన కారణం.  
♦ హ్యారీ బ్రూక్‌ను చాలా తక్కువ మొత్తం (రూ.4 కోట్లు)కే ఢిల్లీ సొంతం చేసుకుంది. గత ఏడాది సన్‌రైజర్స్‌ బ్రూక్‌కు రూ. 13.25 కోట్లు ఇచ్చింది.
♦ బెంగళూరు తరఫున 3 సీజన్లలో ఆకట్టుకున్న లెగ్‌స్పిన్నర్‌ హసరంగను సన్‌రైజర్స్‌ చాలా తక్కువ మొత్తానికి (రూ. 1.50 కోట్లు) సొంతం చేసుకుంది.  
♦ వన్డే వరల్డ్‌కప్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చినా న్యూజిలాండ్‌ ఆటగాడు రచిన్‌ రవీంద్రకు తక్కువ మొత్తమే (రూ.1.80కోట్లు) దక్కింది. అతని సహచరుడు డరైల్‌ మిచెల్‌ కోసం మాత్రం చెన్నై చాలా మొత్తం (రూ.14 కోట్లు) ఖర్చు చేసింది.  
♦ ఫామ్‌ కోల్పోయి భారత జట్టులో స్థానం చేజార్చుకోవడంతో పాటు ఐపీఎల్‌లోనూ భారీగా పరుగులిస్తూ వచ్చిన హర్షల్‌ పటేల్‌ కోసం పంజాబ్‌ కింగ్స్‌ ఏకంగా రూ.11.75 కోట్లు వెచ్చించింది.
♦ విండీస్‌ పేసర్‌ అల్జారీ జోసెఫ్‌ కోసం బెంగళూరు అనూహ్యంగా చాలా పెద్ద మొత్తం (రూ.11.50 కోట్లు) చెల్లించింది.  
♦ ఒకే ఒక అంతర్జాతీయ వన్డే, 2 టి20లు ఆడిన ఆస్ట్రేలియా పేసర్‌ స్పెన్సర్‌ జాన్సన్‌కు రూ. 10 కోట్లు దక్కడం అనూహ్యం.  
♦ వేలంలో ముందుగా పేరు వచ్చినప్పుడు రిలీ రోసో (దక్షిణాఫ్రికా)ను ఎవరూ పట్టించుకోలేదు కానీ చివర్లో పంజాబ్‌ కింగ్స్‌ రూ. 8 కోట్లకు అతడిని కొనుగోలు చేయడం విశేషం.  

వేలంలో టాప్‌–10 వీరే... 
1. స్టార్క్‌ (కోల్‌కతా) రూ. 24.75 కోట్లు 
2. కమిన్స్‌ (హైదరాబాద్‌) రూ. 20.50 కోట్లు
3. మిచెల్‌ (చెన్నై) రూ. 14 కోట్లు 
4. హర్షల్‌ పటేల్‌ (పంజాబ్‌) రూ. 11.75 కోట్లు
5. జోసెఫ్‌ (బెంగళూరు) రూ. 11.50 కోట్లు
6. స్పెన్సర్‌ జాన్సన్‌ (గుజరాత్‌) రూ. 10 కోట్లు 
7. సమీర్‌ రిజ్వీ (చెన్నై) రూ. 8.40 కోట్లు 
8. రిలీ రోసో (పంజాబ్‌) రూ. 8 కోట్లు 
9. షారుఖ్‌ (గుజరాత్‌) రూ. 7.40 కోట్లు
10. పావెల్‌ (రాజస్తాన్‌) రూ. 7.40 కోట్లు

నిజంగానే షాక్‌కు గురయ్యాను. ఇంత మొత్తాన్ని అసలు ఊహించలేదు. ఎనిమిదేళ్ల తర్వాత ప్రపంచంలోని అత్యుత్తమ టి20 లీగ్‌లో మళ్లీ ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. ఇప్పుడు విలువ పెరిగినా నా ఆటతీరు ఎప్పుడూ మారలేదు. భారీ మొత్తం కాబట్టి ఒత్తిడి సహజమే అయినా... నాకున్న అనుభవంతో మంచి ఫలితాలు సాధిస్తాననే నమ్మకం ఉంది.     –మిచెల్‌ స్టార్క్‌ 

సన్‌రైజర్స్‌తో జత కట్టేందుకు అమితోత్సాహంతో ఉన్నా. ఆరెంజ్‌ ఆర్మీ గురించి చాలా విన్నా. హైదరాబాద్‌లో కూడా మ్యాచ్‌లు ఆడా. నాకు బాగా నచ్చింది. నాతో పాటు హెడ్‌ కూడా ఉన్నాడు. విజయాలతో సీజన్‌ సాగాలని ఆశిస్తున్నా.  –ప్యాట్‌ కమిన్స్‌ 

మిచెల్‌ స్టార్క్‌ రెండు సార్లు మాత్రమే ఐపీఎల్‌లో (2014–15) అదీ బెంగళూరు జట్టు తరఫునే ఆడాడు. 27 మ్యాచ్‌లలో 7.16 ఎకానమీతో 34 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత వేర్వేరు కారణాలతో అతను ఎనిమిది సీజన్ల పాటు లీగ్‌కు దూరంగా ఉన్నాడు. 2018లో కోల్‌కతా అతడిని ఎంచుకున్నా... గాయంతో టోర్నీకి ముందే తప్పుకున్నాడు. 
ప్యాట్‌ కమిన్స్‌ ఢిల్లీ తరఫున 12 మ్యాచ్‌లు, కోల్‌కతా తరఫున 30 మ్యాచ్‌లు ఆడి మొత్తం 45 వికెట్లు పడగొట్టాడు. 2020 వేలంలో కేకేఆర్‌ అతనికి రూ. 15.50 కోట్లు ఇచ్చింది. అంతర్జాతీయ షెడ్యూల్‌ కారణంగా 2023 సీజన్‌లో కమిన్స్‌ ఆడలేదు. వరల్డ్‌ కప్‌లో జట్టును విజేతగా నిలిపి అతను మళ్లీ ఇక్కడ అడుగు పెట్టాడు. 

Advertisement
 
Advertisement