Sreesanth Reveals Shocking Details Behind IPL Spot Fixing Saga: 2013 ఐపీఎల్ సీజన్‌లో సంచలనం రేపిన స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంపై టీమిండియా మాజీ పేస్ బౌలర్ శాంతకుమరన్ శ్రీశాంత్ తొలిసారి బహిరంగంగా నోరు విప్పాడు. తాను స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని, ఉద్దేశపూర్వకంగా కొందరు తనను ఇరికించారని, దాని వల్ల తన కెరీర్ అర్ధాంతరంగా ముగిసిందని వాపోయాడు. క్లిష్ట పరిస్థితుల్లో తన వెంటే ఉన్న కుటుంబ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులకు జీవితాంతం రుణపడి ఉంటానని, తాను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడంలో వారి పాత్ర అసమానమని, వారి ప్రార్ధనల వల్లే తాను తిరిగి సాధారణ జీవితం గడపగలుగుతున్నానని పేర్కొన్నాడు. ప్రముఖ క్రీడా వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..

అభం శుభం తెలియని నన్ను కొందరు టార్గెట్ చేసి మరీ ఈ కేసులో ఇరికించారని, చూసేందుకు రఫ్‌గా కనిపించినా తానెవరికీ కీడు తలపెట్టలేదని, వీలైనంతవరకూ సాయం చేశానే కానీ.. ఎవరికీ హాని చేయలేదని, అలాంటి నా విషయంలో ఇలా జరగడం బాధాకరమన్నాడు. "గొప్పలు చెప్పుకోవడం అనుకోకపోతే.. గట్టిగా పార్టీ చేసుకుంటే రెండు, మూడు లక్షల వరకు బిల్లు కట్టే నేను.. కేవలం 10 లక్షల కోసం ఫిక్సింగ్‌కు పాల్పడతానా" అంటూ ప్రశ్నించాడు. ఫిక్సింగ్ ఆరోపణల సమయంలో తన కాలి బొటన వేలికి 12 సర్జరీలైనా కూడా 130 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేశానని, ఆ సమయంలో ఒక ఓవర్లో 14 పరుగులు అవసరం కాగా.. నాలుగు బంతుల్లో ఐదు పరుగులు మాత్రమే ఇచ్చానని, ఆ మ్యాచ్‌లో నోబాల్ కానీ వైడ్ బాల్ కానీ వేయలేదని.. అలాంటిది నేను ఎలా ఫిక్సింగ్ చేస్తానని అని ఈ కేరళ స్పీడ్‌స్టర్ ప్రశ్నించాడు. చేతి నిండా డబ్బు ఉండి, కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్న తరుణంలో ఎవ్వరూ అలాంటి పనికి పాల్పడరని పేర్కొన్నాడు. 

కాగా, శ్రీశాంత్ 2013 ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతూ.. స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో దోషిగా తేలాడు. అతనితో సహా మరో ఇద్దరు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్ల (అంకిత్ చవాన్, అజిత్ చండీలా)పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. తన నిషేధంపై కోర్టును అశ్రయించిన శ్రీశాంత్‌కు.. 2019లో ఊరట లభించింది. సుప్రీం కోర్టు అతని నిషేధ కాలాన్ని తగ్గించాలని బీసీసీఐని ఆదేశించడంతో.. శిక్ష ఏడేళ్లకు కుదించబడింది. 2020 సెప్టెంబర్‌తో ఆ నిషేధం పూర్తయింది. అప్పటి నుంచి శ్రీ.. దేశవాళీ క్రికెట్‌లో కేరళ జట్టు తరఫున ఆడుతున్నాడు. శ్రీశాంత్ భారత్ తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 87, వన్డేల్లో 75, టీ20ల్లో 7 వికెట్లు పడగొట్టాడు. అలాగే 44 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 40 వికెట్లు తీశాడు. భారత్ గెలిచిన 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లలో శ్రీశాంత్ సభ్యుడు.

చదవండి: టీమిండియాలోకి శ్రేయస్.. ఆ నలుగురిపై వేటు పడనుందా..? 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
