గంట సేపు గాల్లోనే చక్కర్లు...

SpiceJet Carrying Indian Boxers Stays Mid-Air In Dubai UAE - Sakshi

భారత బాక్సింగ్‌ బృందానికి చేదు అనుభవం

న్యూఢిల్లీ: ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు దుబాయ్‌కి వెళ్లిన భారత బాక్సర్లకు చేదు అనుభవం ఎదురైంది. సరైన అనుమతులు లేవనే కారణంతో శనివారం బాక్సర్లు వెళ్లిన ప్రత్యేక విమానాన్ని (స్పైస్‌ జెట్‌) అక్కడి విమానాశ్రయ అధికారులు ల్యాండింగ్‌కు అనుమతించలేదు. దాంతో గంటకు పైగా విమానం గాల్లోనే చక్కర్లు కొట్టడంతో ఆటగాళ్లంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు ఇంధనం అయిపోవచ్చిదంటూ ‘ఫ్యూయల్‌ ఎమర్జెన్సీ’ని కూడా ప్రకటించింది. చివరకు విదేశాంగ శాఖ జోక్యంతో పరిస్థితి కుదుట పడింది. దీనిపై డైరెక్ట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. కరోనా కారణంగా భారత్‌నుంచి వచ్చే విమానాలపై యూఏఈలో ఆంక్షలు ఉన్నాయి.

సాధారణ ఫ్లయిట్‌లను ఆ దేశం అనుమతించడం లేదు. దాంతో ప్రభుత్వ అనుమతితో భారత బాక్సింగ్‌ సమాఖ్య ప్రత్యేక విమానం ద్వారా వారిని పంపించింది. అయితే దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌తో సమన్వయ లోపం కారణంగా కిందకు దిగేందుకు అనుమతి దక్కలేదు. దాంతో యూఏఈలో ఉన్న భారత రాయబార కార్యాలయంతో మాట్లాడిన తర్వాత అధికారులు ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు. అయితే మరో గంట పాటు అన్ని పత్రాల తనిఖీ పూర్తయ్యే వరకు బాక్సర్లు విమానంనుంచి బయటకు రాలేదు. సోమవారం నుంచి టోర్నీ ఆరంభం కానుండగా... భారత్‌ నుంచి 19 మంది బాక్సర్లు (10 మంది మహిళలు, 9 మంది పురుషులు) బరిలో ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్‌ ముందు జరుగుతున్న చివరి మేజర్‌ బాక్సింగ్‌ టోర్నీ. మహిళల విభాగంలో మేరీ కామ్‌ తదితరులు, పురుషుల 56 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్‌ మొహమ్మద్‌ హుసాముద్దీన్‌ బరిలో ఉన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top