అల్‌కరాజ్‌దే పైచేయి | The Spanish star won the China Open | Sakshi
Sakshi News home page

అల్‌కరాజ్‌దే పైచేయి

Oct 3 2024 3:47 AM | Updated on Oct 3 2024 3:47 AM

The Spanish star won the China Open

వరుసగా మూడోసారి ప్రపంచ నంబర్‌వన్‌ సినెర్‌పై విజయం

చైనా ఓపెన్‌లో విజేతగా నిలిచిన స్పెయిన్‌ స్టార్‌

ఈ ఏడాది నాలుగో టైటిల్‌ సొంతం  

బీజింగ్‌: ఈ ఏడాది పురుషుల టెన్నిస్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్న యానిక్‌ సినెర్, అల్‌కరాజ్‌ మరోసారి ముఖాముఖి పోరులో కొదమ సింహాల్లా పోరాడారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కీలకదశలో పాయింట్లు రాబట్టిన స్పెయిన్‌ స్టార్‌ అల్‌కరాజ్‌ పైచేయి సాధించాడు. తద్వారా ప్రపంచ నంబర్‌వన్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ)పై అల్‌కరాజ్‌ వరుసగా మూడోసారి గెలుపొంది ఈ సీజన్‌లో నాలుగో సింగిల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 

బుధవారం ముగిసిన చైనా ఓపెన్‌ ఏటీపీ–500 టోర్నీలో ప్రపంచ మూడో ర్యాంకర్‌ అల్‌కరాజ్‌ చాంపియన్‌గా నిలిచాడు. 3 గంటల 21 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో అల్‌కరాజ్‌ 6–7 (6/8), 6–4, 7–6 (7/3)తో డిఫెండింగ్‌ చాంపియన్‌ సినెర్‌ను ఓడించాడు. చైనా ఓపెన్‌కంటే ముందు ఈ సీజన్‌లో అల్‌కరాజ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్, వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ, ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీ టైటిల్స్‌ను సాధించాడు. 

సినెర్‌తో జరిగిన తుది పోరులో తొలి సెట్‌లో అల్‌కరాజ్‌ 5–2తో ఆధిక్యంలో నిలిచాడు. అయితే సినెర్‌ పుంజుకొని స్కోరును సమం చేశాడు. చివరకు టైబ్రేక్‌లో తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్‌లో అల్‌కరాజ్‌ కోలుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో సెట్‌లోనూ ఇద్దరూ హోరాహోరాగా పోరాడారు. తుదకు టైబ్రేక్‌లో అల్‌కరాజ్‌ పైచేయి సాధించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. 

విజేతగా నిలిచిన అల్‌కరాజ్‌కు 6,95,750 డాలర్ల (రూ. 5 కోట్ల 84 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్‌ పాయింట్లు... రన్నరప్‌ సినెర్‌కు 3,74,340 డాలర్ల (రూ. 3 కోట్ల 14 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 330 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 

Advertisement
 
Advertisement
Advertisement