కిన్‌వెన్ జెంగ్ ఖాతాలో డబ్ల్యూటీఏ సింగిల్స్ టైటిల్
చైనా ఓపెన్–1000 సిరీస్ టైటిల్ సొంతం
వైల్డ్ కార్డు హోదాలో విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా రికార్డు
బీజింగ్: సొంతగడ్డపై చైనా టెన్నిస్ స్టార్ కిన్‌వెన్ జెంగ్ సంచలనం సృష్టించింది. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) చైనా ఓపెన్–1000 సిరీస్ టైటిల్‌ను కిన్‌వెన్ జెంగ్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో రెండేళ్ల టైటిల్ నిరీక్షణకు ఆమె తెరదించింది. చివరిసారి 2024 అక్టోబరులో కిన్‌వెన్ టోక్యోలో పాన్ పసిఫిక్ ఓపెన్ టైటిల్ సాధించింది. ఆదివారం ముగిసిన చైనా ఓపెన్ టోర్నీ సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 54వ ర్యాంకర్ కిన్‌వెన్ 7–5, 6–4తో ఫ్రెంచ్ ఓపెన్ చాంపియిన్ మిరా ఆండ్రీవా (రష్యా)పై విజయం సాధించింది.
తద్వారా ఈ టోర్నీలో టైటిల్ గెలిచిన తొలి చైనా ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. అంతేకాకుండా ‘వైల్డ్ కార్డు’తో ఈ టోర్నీలో బరిలోకి దిగి టైటిల్ గెలిచిన తొలి ప్లేయర్‌గానూ పారిస్ ఒలింపిక్స్ పసిడి పతక విజేత అయిన కిన్‌వెన్ రికార్డు నెలకొల్పింది. ఓవరాల్‌గా కిన్‌వెన్‌కిది ఆరో సింగిల్స్ టైటిల్‌కాగా... 1000 లెవెల్‌లో తొలి టైటిల్. విజేత హోదాలో కిన్‌వెన్‌కు 11,51,380 డాలర్ల (రూ. 11 కోట్ల 14 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.


