ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎంపిక ఖరారైనట్లు తెలుస్తుంది. దిగ్గజ వికెట్‌కీపర్-బ్యాటర్ అలైస్సా హీలీ రిటైర్మెంట్ (ఫిబ్రవరి-మార్చిలో జరిగే భారత్ సిరీస్ తర్వాత) ప్రకటించడంతో, ఆమె స్థానంలో సోఫీ మోలినెక్స్‌ను కొత్త ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం.
ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. మోలినెక్స్‌కు పట్టం కట్టడం దాదాపుగా ఖరారైనట్లు ఆసీస్ మీడియా వర్గాలు అంటున్నాయి. కొద్ది రోజుల కిందటి వరకు రేసులో లేని మోలినెక్స్ అనూహ్యంగా కెప్టెన్సీని దక్కించుకుందని కథనాలు వెలువడుతున్నాయి.

అందులోనూ ఆమెను ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. హీలీ తర్వాత కెప్టెన్సీ రేసులో ఎల్లిస్ పెర్రీ, ఆష్లే గార్డ్‌నర్ పేర్లు ప్రధానంగా వినిపించినా, క్రికెట్ ఆస్ట్రేలియా మోలినెక్స్‌వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది.
28 ఏళ్ల మోలినెక్స్ 2018లో భారత్‌తో జరిగిన టీ20 ట్రై-సిరీస్‌తో ఆసీస్ తరఫున అరంగేట్రం చేసింది. ఇప్పటివరకు ఆమె 3 టెస్ట్‌లు, 17 వన్డేలు, 38 టీ20లు ఆడింది. లెఫ్ట్-ఆర్మ్ స్పిన్నర్‌గా 76 అంతర్జాతీయ వికెట్లు సాధించిన ఆమె, లోయర్ ఆర్డర్ బ్యాటర్‌గా చాలా ఉపయోగకరమైన ప్రదర్శనలు చేసింది.
హీలీ నాయకత్వం వహించిన జట్టులో మోలినెక్స్ కీలక పాత్ర పోషించింది. 2018, 2020 టీ20 వరల్డ్ కప్‌లలో ఆస్ట్రేలియా విజయాల్లో భాగమైంది. ఇటీవల ముగిసిన మహిళల వన్డే వరల్డ్ కప్‌లోనూ ఎనిమిది వికెట్లు తీసి సత్తా చాటింది. మోలినెక్స్ ఎంపిక ఆసీస్‌కు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతుల్యత తీసుకొస్తుంది.


