T20 World Cup 2022: ఆస్ట్రేలియా విమానమెక్కనున్న షమీ, సిరాజ్‌, శార్ధూల్‌

Siraj, Shami And Shardul To Be Flown To Australia Ahead Of T20 World Cup - Sakshi

టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతూ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. అయితే, అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు భారత సెలెక్షన్‌ కమిటీ రకరకాల వడపోతలు పట్టి అంతిమంగా ముగ్గురు పేర్లను ఫైనల్‌ చేసింది. షమీ, సిరాజ్‌, శార్ధూల్‌లలో (ట్రిపుల్‌ ఎస్‌) ఒకరు బుమ్రా స్థానాన్ని భర్తీ చేస్తారని టీమిండియా యాజమాన్యం డిసైడ్‌ చేసింది. దీంతో ఈ ముగ్గురు టీమిండియాను కలిసేందుకు ఇవాళో రేపో ఆస్ట్రేలియాకు బయల్దేరనున్నారు. 

వీరితో పాటు స్టాండ్‌ బై ప్లేయర్లుగా ఎంపికైన శ్రేయస్‌ అయ్యర్‌, రవి బిష్ణోయ్‌లు కూడా ఆస్ట్రేలియా విమానమెక్కనున్నారు. మరో స్టాండ్‌ బై ప్లేయర్‌ దీపక్‌ చాహర్‌కు గాయం తిరగబెట్టడంతో అతను ఆస్ట్రేలియాకు వెళ్లే దారులు దాదాపుగా మూసుకుపోయాయి. మరోవైపు నెట్‌ బౌలర్లుగా ఎంపికైన ఉమ్రాన్‌ మాలిక్‌, కుల్దీప్‌ సేన్‌ వీసా సమస్యల కారణంగా భారత్‌లోనే ఉండిపోయారు. వీసా ఇష్యూస్‌ క్లియర్‌ అయితే ఈ ఇద్దరు కూడా ఆస్ట్రేలియాకు బయలుదేరతారు.  

ఇదిలా ఉంటే, బుమ్రా స్థానంలో తుది జట్టులో ఎవరుంటారనే అంశం టీమిండియా అభిమానులను తెగ వేధిస్తుంది. కొందరేమో షమీనే అందుకు అర్హుడని అభిప్రాయపడుతుంటే.. మరికొందరేమో సిరాజ్‌కు ఆస్ట్రేలియాలో బౌన్సీ పిచ్‌లపై మంచి సక్సెస్‌ రేట్‌ ఉంది కాబట్టి అతన్నే ఎంపిక చేయాలని సూచిస్తున్నారు. ఇంకొందరేమో శార్ధూల్‌కు ఓటేస్తున్నారు. మరోపక్క టీమిండియా రెగ్యులర్‌ సభ్యుడిగా ఉన్న హర్షల్‌ పటేల్‌ ఫామ్‌ లేమి సమస్య అటు సెలక్టర్లను ఇటు అభిమానులను తెగ కలవరపెడుతుంది. ఇప్పటికే బుమ్రా దూరమై నైరాశ్యంలో ఉన్న వీరికి.. హర్షల్‌ సమస్య మరో తలనొప్పిగా మారింది. ఇన్ని సమస్యల నడుమ టీమిండియా వరల్డ్‌కప్‌లో ఎలా నెట్టుకొస్తుందో వేచి చూడాలి.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top