చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. తొలి భారత కెప్టెన్‌గా | Shubman Gill Becomes 1st Indian To Achieve Stunning Feat | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. తొలి భారత కెప్టెన్‌గా

Jun 8 2026 8:49 AM | Updated on Jun 8 2026 9:58 AM

Shubman Gill Becomes 1st Indian To Achieve Stunning Feat

ముల్లాన్‌పూర్ వేదిక‌గా అఫ్గానిస్తాన్‌తో జ‌రుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ప‌ట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌ను 564/8 పరుగుల భారీ స్కోర్‌ వద్ద డిక్లేర్‌ చేసిన భారత్‌.. అనంతరం బౌలింగ్‌లో పర్యాటక జట్టుకు చుక్కలు చూపిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ 39.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. అఫ్గాన్ ఇంకా  451 పరుగుల భారీ వెనుకంజలో ఉంది.

అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో అదరగొట్టిన గిల్‌.. అదే జోరును అఫ్గాన్ మ్యాచ్‌లో కూడా కొనసాగించాడు. 177 బంతుల్లో  15 ఫోర్లు, 1 సిక్స్‌తో 122 పరుగులు చేశాడు.

ఈ ఇన్నింగ్స్‌తో కెప్టెన్‌గా 1000 పరుగుల మైలురాయిని కూడా గిల్ అధిగమించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 1000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన 101వ కెప్టెన్‌గా శుబ్‌మన్ నిలిచాడు. అయితే ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో గిల్ అత్యుత్తమ సగటు కలిగిన రెండో కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. 

ఈ మైలురాయిని అతడు ఏకంగా 82.76 సగటుతో అందుకోవడం విశేషం. ఆస్ట్రేలియా దిగ్గజం సర్‌ డాన్ బ్రాడ్‌మన్(101.51) మాత్రమే గిల్ కంటే మెరుగైన సగటును కలిగి ఉన్నాడు. ఈ జాబితాలో శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కర 69.6 సగటుతో మూడో స్థానంలో ఉన్నాడు. భారత క్రికెట్‌ నుంచి మాత్రం గిల్‌ కంటే ముందు ఏ కెప్టెన్‌ కూడా ఈ ఫీట్‌ సాధించలేదు.

అదేవిధంగా కెప్టెన్‌గా అత్యంత వేగంగా 1000 టెస్ట్ పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాళ్లలో గిల్ రెండో స్థానానికి చేరుకున్నాడు. గిల్ కేవలం 15 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. తొలి స్ధానంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్(14 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement