టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గువాహటి వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో గిల్ దుమ్మురేపాడు. 406 పరుగుల కొండంత లక్ష్య ఛేదనలో కెప్టెన్‌గా ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. కేవలం 50 బంతుల్లోనే 81 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ఈ క్రమంలోనే గిల్ వన్డే క్రికెట్‌లో ఓ సరికొత్త ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
అత్యంత వేగంగా 3,500 వన్డే పరుగులు
వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 3,500 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా గిల్ చరిత్ర సృష్టించాడు. కేవలం 68 ఇన్నింగ్స్‌ల్లోనే గిల్ ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
ఇంతకుముందు ఈ రికార్డు సౌతాఫ్రికా దిగ్గజం హాషిమ్ ఆమ్లా (69 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండగా, గిల్ ఆ ఆల్‌టైమ్ రికార్డును తిరగరాశాడు. ప్రస్తుతం గిల్ వన్డే కెరీర్‌లో 10 సెంచరీలు, 20 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, సచిన్ టెండూల్కర్‌లకు కూడా సాధ్యం కాలేదు.
స్వదేశంలోనూ సరికొత్త చరిత్ర
దీంతో పాటు గిల్ మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. స్వదేశంలో అత్యంత వేగంగా 2,000 వన్డే పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. భారతదేశంలో కేవలం 33 ఇన్నింగ్స్‌ల్లోనే గిల్ ఈ ఘనత సాధించాడు.
గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ మాజీ దిగ్గజం డెస్మండ్ హెయిన్స్ (36 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండగా, క్వింటన్ డి కాక్ (37 ఇన్నింగ్స్‌లు) తర్వాతి స్థానంలో ఉన్నాడు. తాజా ప్రదర్శనతో గిల్ వీరిద్దరినీ దాటేసి అగ్రస్థానానికి చేరుకున్నాడు.
చదవండి: IND vs WI: వెస్టిండీస్ కెప్టెన్ ప్రపంచ రికార్డు


