టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను గత కొంతకాలంగా వేధిస్తున్న వన్డే వికెట్ల కరువు ఎట్టకేలకు ముగిసింది. ఏకంగా 277 బంతుల తర్వాత అతడు మళ్లీ వన్డేల్లో వికెట్ పడగొట్టాడు. గువాహటి వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో విండిస్ బ్యాటర్ అమీర్ జాంగోను ఔట్ చేయడం ద్వారా జడేజా ఈ సుదీర్ఘ నిరీక్షణను ముగించాడు.
అంతేకాకుండా ఈ వికెట్‌తో జడేజా ఓ అరుదైన ఘనతను కూడా తన పేరిట లిఖించుకున్నాడు. భారత్-వెస్టిండీస్ వన్డేల చరిత్రలోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా జడేజా నిలిచాడు. జడేజా ఇప్పటివరకు భారత్-విండీస్ వన్డే సిరీస్‌లలో 45 వికెట్లు పడగొట్టాడు.
ఇంతకుముందు ఈ రికార్డు లెజెండ్ కోర్ట్నీ వాల్ష్ పేరిట ఉండేది. 1985-99 మధ్య కాలంలో భారత్‌తో 38 మ్యాచ్‌లు ఆడి వాల్ష్ 44 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో 27 ఏళ్ల వాల్ష్ ఆల్‌టైమ్ రికార్డును జడ్డూ బ్రేక్ చేశాడు.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీ స్కోర్ సాధించింది. జాన్ క్యాంప్‌బెల్(101), షాయ్ హోప్(104), అమీర్ జంగూ(114) భారీ సెంచరీలతో కదం తొక్కారు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ తలా వికెట్ సాధించారు.


