పంత్‌ ఆడటంపై స్పష్టత లేదు: అయ్యర్‌

Shreyas Iyer Confirms Injured Rishabh Pant Out Of Action - Sakshi

తొడకండరాల గాయంతో రిషభ్‌కు రెస్ట్‌

తిరిగి ఆడటంపై సందేహాలు

అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 163 పరుగుల టార్గెట్‌ను ముంబై ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగా ఛేదించి మరో గెలుపును నమోదు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఆడలేదు. తొడ కండరాల గాయంతో పంత్‌ మ్యాచ్‌కు దూరమయ్యాడు. కాగా, పంత్‌ గాయం నుంచి కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ స్పష్టం చేశాడు. మ్యాచ్‌ తర్వాత అవార్డుల ప్రదానోత్సవంలో మాట్లాడిన అయ్యర్‌ను పంత్‌ గురించి అడగ్గా ఇంకా ఎటువంటి స్పష్టతా లేదన్నాడు. ‘ నాకైతే పంత్‌ అందుబాటులో ఉండటం గురించి తెలీదు. పంత్‌కు వారం రోజులు విశ్రాంతి కావాలని డాక్టర్లు చెప్పారు. (ఖలీల్‌పై రాహుల్‌ తెవాటియా ఫైర్‌ !)

త‍్వరలోనే జట్టులో చేరతాడని ఆశిస్తున్నా. అతను ఎప్పుడు జట్టుకు అందుబాటులోకి వస్తాడు అనేది మాత్రం నాకైతే తెలీదు. ఆ నిర్ణయం మేనేజ్‌మెంట్‌ చూసుకుంటుంది’ అని తెలిపాడు. ఇక ఓటమి గురించి మాట్లాడుతూ.. ‘ మేము(ఢిల్లీ) 10 నుంచి 15 పరుగులైతే తక్కువ చేశాం. బోర్డుపై 170-175 పరుగులు ఉండి ఉంటే మ్యాచ్‌ మరొలా ఉండేది. ఆ కారణంగానే మ్యాచ్‌ను కోల్పోవాల్సి వచ్చింది. మరొకవైపు స్టోయినిస్‌ రనౌట్‌ కావడం కూడా ప్రభావం చూపింది. స్టోయినిస్‌ బంతిని బాగా హిట్‌ చేస్తున్నాడు. స్టోయినిస్‌ వికెట్‌ను రనౌట్‌ రూపంలో కోల్పోవడం మేము మ్యాచ్‌లో చేసిన తప్పిదం. ఇది ఫలితంపై ప్రభావం చూపింది’ అని అయ్యర్‌ పేర్కొన్నాడు.

నిన్న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్‌ స్థానంలో రహానే తుది జట్టులోకి వచ్చాడు. దాంతో వికెట్‌ కీపర్‌గా అలెక్స్‌ క్యారీని తీసుకోగా, హెట్‌మెయిర్‌ను రిజర్వ్‌ బెంచ్‌లో కూర్చొబెట్టారు. పంత్‌ గాయం కారణంగా రహానే జట్టులోకి రావడం ఒకటైతే, విదేశీ ఆటగాళ్లు నలుగురికి మించి ఆడకూడనే నిబంధనతో హెట్‌మెయిర్‌ స్థానంలో క్యారీని కీపర్‌గా తీసుకోవాల్సి వచ్చింది. కాగా, క్యారీ నుంచి ఎటువంటి మెరుపు ఇన్నింగ్స్‌ రాలేదు. 9 బంతులాడి 14 పరుగులు చేసినా అవి సింగిల్స్‌, డబుల్స్‌ రూపంలోనే వచ్చాయి.  అదే పంత్‌ జట్టులో ఉండి ఉంటే మరిన్ని పరుగులు వచ్చేవని, దాంతో మ్యాచ్‌పై పట్టుసాధించడానికి ఆస్కారం దొరికేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.(69 పరుగులు‌: ధావన్‌పై నెటిజన్ల ఫైర్‌!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top