
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశాడు. గురుగ్రామ్ (Gurugram)లోని విలాసవంతమైన ఈ ఇంటి కోసం దాదాపు రూ. 69 కోట్లు ఖర్చు చేశాడు. కాగా భారత జట్టు మాజీ ఓపెనర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు శిఖర్ ధావన్.
రోహిత్ శర్మ (Rohit Sharma)కు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగిన ధావన్.. 2013లో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా ఐసీసీ ఈవెంట్లో కేవలం ఐదు ఇన్నింగ్స్‌లోనే 363 పరుగులతో సత్తా చాటి ధోని సేన ట్రోఫీని ముద్దాడేలా చేశాడు.
జాతీయ జట్టు తరఫున ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన ధావన్.. శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్‌ల రాకతో టీమిండియాలో స్థానం కోల్పోయాడు. ఈ క్రమంలో 2022లో చివరగా భారత్‌కు ఆడిన ధావన్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
రెండు చేతులా సంపాదన.. నికర ఆస్తి?
మొత్తంగా టీమిండియా తరఫున 288 మ్యాచ్‌లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 10867 పరుగులు సాధించాడు. ఇక ఫామ్‌లో ఉండగా రెండు చేతులా సంపాదించిన ధావన్.. ఐపీఎల్ ద్వారా కూడా కోట్లాది రూపాయలు ఆర్జించాడు. పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గానూ వ్యవహరించి తన నెట్‌వర్క్‌ను పెంచుకున్నాడు.
జాతీయ స్పోర్ట్స్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.. 2025 నాటికి శిఖర్ ధావన్ నికర ఆస్తుల విలువ రూ. 120 కోట్లు ఉన్నట్లు అంచనా. ఇక 39 ఏళ్ల ధావన్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆయేషా ముఖర్జీ అనే డివోర్సీని పెళ్లి చేసుకున్న గబ్బర్‌కు కుమారుడు జొరావర్ ఉన్నాడు.
మరోసారి ప్రేమలో గబ్బర్
అయితే, ఆయేషాతో విభేదాల కారణంగా 2023లో విడాకులు తీసుకున్నాడు. ఇక గత కొంతకాలంగా ఐర్లాండ్‌కు చెందిన సోఫీ షైన్ అనే మహిళతో శిఖర్ ధావన్ డేటింగ్ చేస్తున్నాడు. ఈ జంట సహజీవనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో గబ్బర్ గురుగ్రామ్‌లో కొత్త ఫ్లాట్ కొనడం విశేషం.
గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్ 5, సెక్టార్ 54, గోల్ఫ్ కోర్స్ రోడ్‌లోని రెసిడెన్షియల్ ప్రాజెక్టులో ధావన్ ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీని ధర రూ. సుమారు 65.61 కోట్లు కాగా..స్టాంపు డ్యూటీగా రూ. 3.28 కోట్లు చెల్లించినట్లు సమాచారం.
అద్బుత ఆట తీరుతో
కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తంగా 167 వన్డేలు ఆడి 6793 పరుగులు చేసిన గబ్బర్..టెస్టు ఫార్మాట్‌లో 34 మ్యాచ్‌లు ఆడి 2315 రన్స్ సాధించాడు. ఇక టీమిండియా తరఫున 68 టీ20లలో 1759 పరుగులు చేసిన గబ్బర్.. ఐపీఎల్‌లో 221 ఇన్నింగ్స్‌లో 6769 పరుగులు సాధించాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఇప్పటికీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇలా తన అద్బుత ఆట తీరుతో కోట్లు గడించాడు ధావన్.
చదవండి: ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్‌కే కెప్టెన్ రియాక్షన్ వైరల్