‘అమ్మ’ గెలిచింది 

Serena Williams Entered Into Third Round In US Open - Sakshi

మూడో రౌండ్‌లోకి సెరెనా, అజరెంకా 

తొమ్మిదో సీడ్‌ యోహానా కొంటా ఓటమి

యూఎస్‌ ఓపెన్‌ టోర్నీ

మూడు పదుల వయసు దాటినా... తల్లి హోదా వచ్చినా... మైదానంలోకి దిగితే విజయమే తమ లక్ష్యమని ప్రపంచ  మాజీ నంబర్‌వన్‌ క్రీడాకారిణులు సెరెనా విలియమ్స్, విక్టోరియా అజరెంకా చాటి చెప్పారు. యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో ఈ ఇద్దరు అమ్మలు అదరగొట్టే విజయాలతో మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లి టైటిల్‌ దిశగా  మరో అడుగు ముందుకు వేశారు.

న్యూయార్క్‌: ఒకవైపు యువ సీడెడ్‌ క్రీడాకారిణులు ఇంటిముఖం పడుతుండగా... మరోవైపు తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో వెటరన్‌ స్టార్‌ క్రీడాకారిణులు సెరెనా విలియమ్స్‌ (అమెరికా), విక్టోరియా అజరెంకా (బెలారస్‌) యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ముందంజ వేశారు. తల్లి అయ్యాక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన నాలుగో క్రీడాకారిణిగా గుర్తింపు పొందేందుకు వీరిద్దరు పోటీపడుతున్నారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో సెరెనా 6–2, 6–4తో ప్రపంచ 117వ ర్యాంకర్‌ మర్గరీటా గస్‌పారన్‌ (రష్యా)పై, అజరెంకా 6–1, 6–3తో ఐదో సీడ్‌ అరీనా సబలెంకా (బెలారస్‌)పై విజయం సాధించారు.

మరో ‘అమ్మ’ స్వెతానా పిరన్‌కోవా (బల్గేరియా) 7–5, 6–3తో పదో సీడ్‌ గార్బిన్‌ ముగురుజా (స్పెయిన్‌)ను ఓడించి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. ఓవరాల్‌గా ఈ ఏడాది యూఎస్‌ ఓపెన్‌లో తొమ్మిది మంది తల్లి హోదా ఉన్న క్రీడాకారిణులు బరిలోకి దిగారు. ఇందులో ఆరుగురు కిమ్‌ క్లియ్‌స్టర్స్‌ (బెల్జియం), వెరా జ్వొనరేవా (రష్యా), తతియానా మరియా (జర్మనీ), కాటరీనా బొండారెంకో (ఉక్రెయిన్‌), పత్రిసియా మరియా తిగ్‌ (రొమేనియా), ఓల్గా గొవొర్సోవా (బెలారస్‌) నిష్క్రమించగా... సెరెనా, అజరెంకా, పిరన్‌కోవా బరిలో మిగిలి ఉన్నారు. గస్‌పారన్‌తో 93 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సెరెనా ఏడు ఏస్‌లు సంధించి, తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేసింది.  

క్రిస్టియా సంచలనం 
మహిళల సింగిల్స్‌ విభాగంలో మరో సంచలనం ఫలితం వచ్చింది. ప్రపంచ 77వ ర్యాంకర్‌ సొరానా క్రిస్టియా 2–6, 7–6 (7/5), 6–4తో తొమ్మిదో సీడ్‌ యోహానా కొంటా (బ్రిటన్‌)ను బోల్తా కొట్టించి ఈ టోర్నీలో మూడోసారి మూడో రౌండ్‌కు చేరింది. ఇతర మ్యాచ్‌ల్లో రెండో సీడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా) 6–4, 6–3తో లేలా ఫెర్నాండెజ్‌ (కెనడా)పై, ఏడో సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా) 6–2, 6–1తో అలియానా బోల్సోవా (స్పెయిన్‌)పై, 15వ సీడ్‌ మరియా సాకరి (గ్రీస్‌) 2–6, 6–3, 6–2తో బెర్నార్దా పెరా (అమెరికా)పై, 26వ సీడ్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా) 6–2, 6–2తో గొవొర్సోవా (బెలారస్‌)పై నెగ్గారు.  

ముర్రే ఇంటిదారి 
పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో 2012 చాంపియన్‌ ఆండీ ముర్రే (బ్రిటన్‌) 2–6, 3–6, 4–6తో ఫీలిక్స్‌ ఉజర్‌ అలియాసిమ్‌ (కెనడా) చేతిలో ఓడిపోయాడు. మూడో సీడ్‌ మెద్వెదేవ్‌ (రష్యా) 6–3, 6–2, 6–4తో క్రిస్టోఫర్‌ కానెల్‌ (ఆస్ట్రేలియా)పై, ఆరో సీడ్‌ బెరెటిని (ఇటలీ) 6–4, 6–4, 7–6 (8/6)తో హుంబెర్ట్‌ (ఫ్రాన్స్‌)పై గెలుపొందారు.

సుమీత్‌ నిష్క్రమణ 
పురుషుల సింగిల్స్‌ బరి లో ఉన్న ఏకైక భారత క్రీడాకారుడు సుమీత్‌ నాగల్‌ కథ రెండో రౌండ్‌ లో ముగిసింది. సుమీత్‌ 3–6, 3–6, 2–6తో రెండో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) చేతిలో ఓడిపోయాడు. గంటా 59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమీత్‌ 40 అనవసర తప్పిదాలు చేశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top