వింబుల్డ‌న్ డ‌బుల్స్ బ‌రిలో సెరెనా, వీన‌స్‌ | Serena-Venus Williams To play doubles together at Wimbledon 2026 | Sakshi
Sakshi News home page

వింబుల్డ‌న్ డ‌బుల్స్ బ‌రిలో సెరెనా, వీన‌స్‌

Jun 17 2026 11:52 AM | Updated on Jun 17 2026 1:23 PM

Serena-Venus Williams To play doubles together at Wimbledon 2026

లండన్‌: వెటరన్‌ టెన్నిస్‌ ప్లేయర్లు సెరెనా విలియమ్స్, వీనస్‌ విలియమ్స్‌కు వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో ‘వైల్డ్‌ కార్డు’ ప్రవేశం దక్కింది. ఈ నెల 29 నుంచి సీజన్‌ మూడో గ్రాండ్‌స్లామ్‌ వింబుల్డన్‌ ప్రారంభం కానుండగా... అమెరికాకు చెందిన విలియమ్స్‌ సిస్టర్స్‌కు మహిళల డబుల్స్‌లో పాల్గొనేందుకు ‘ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌’ ప్రత్యేకంగా ఆహ్వానించింది.

46 ఏళ్ల వీనస్, 44 ఏళ్ల సెరెనా జోడీ మహిళల డబుల్స్‌లో 14 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గింది. వీరికి వింబుల్డన్‌లో ఘనమైన రికార్డు ఉంది. ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌లో ఈ జంట ఆరుసార్లు మహిళల డబుల్స్‌ ట్రోఫీ చేజిక్కించుకుంది. 2000లో తొలిసారి ఈ టోర్నీలో టైటిల్‌ నెగ్గిన సెరెనా–వీనస్‌ చివరిసారిగా 2016లో ఇక్కడ విజేతగా నిలిచారు. 

2000తో పాటు 2002లో సైతం ఈ జంట ‘వైల్డ్‌ కార్డ్‌’ ద్వారా వింబుల్డన్‌లో ప్రవేశించే టైటిల్‌ హస్తగతం చేసుకోవడం విశేషం. 2022 యూఎస్‌ ఓపెన్‌లో చివరిసారిగా కలిసి ఆడిన ఈ ఇద్దరూ... మళ్లీ నాలుగేళ్ల తర్వాత వింబుల్డన్‌లో జట్టు కట్టనున్నారు. పురుషుల సింగిల్స్‌లో మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన వావ్రింకాకు ‘వైల్డ్‌ కార్డ్‌’ ఎంట్రీ లభించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement