breaking news
venus williams
-
సోదరిపై వీనస్ విజయం
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్లో నల్ల కలువ సెరెనా విలియమ్స్‌పై అక్క వీనస్ విలియమ్స్ విజయం సాధించింది. మహిళల సింగిల్స్ లో భాగంగా మూడో రౌండ్ పోరులో వీనస్ విలియమ్స్ 6-3, 6-4 తేడాతో సెరెనాపై గెలుపొందింది. సుమారు గంటకు పైగా సాగిన మ్యాచ్ లో సెరీనా 41 అనవసర తప్పిదాలు చేసింది. దీంతో వీనస్ విలియమ్స్ ను విజయం వరించింది. గతేడాది సెప్టెంబరులో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సెరెనా.. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి తప్పుకుంది. అనంతరం ఇటీవల అబుదాబిలో జరిగిన ఎగ్జిబిషన్ టోర్నీలో మళ్లీ రాకెట్ చేతబట్టింది. అయితే ఈ టోర్నీలో సెరెనా తొలి రౌండ్లోనే ఓడిపోయింది. వీరిద్దరి మధ్య ఇప్పటివరకూ జరిగిన 28 మ్యాచ్‌ల్లో సెరెనా 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, వీనస్ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందారు. అక్కా చెల్లెల్ల మధ్య జరిగిన గత తొమ్మిది మ్యాచ్‌లకు గాను ఎనిమిది మ్యాచ్‌ల్లో సెరెనా విజయం సాధించారు. 1998 ఆస్ట్రేలియా ఓపెన్‌లో వీరిద్దరూ ముఖాముఖి పోరులో తొలిసారి తలపడగా, 2014 తర్వాత సెరెనాపై వీనస్ విజయాన్ని సాధించడం ఇదే తొలిసారి. -
తుది పోరులో 'సిస్టర్స్'
సిడ్నీ:ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ తుది పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు విలియమ్స్ సిస్టర్స్ సిద్ధమయ్యారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫెనల్లో వారిద్దరూ తమ తమ ప్రత్యర్థులపై విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించారు. నల్ల కలువ సెరెనా విలియమ్స్ 6-2, 6-1 తేడాతో లూసిచ్ పై గెలుపొంది ఫైనల్ కు చేరగా.. వీనస్ విలియమ్స్ 6-7(3/7), 6-2, 6-3 తేడాతో మరో అమెరికా క్రీడాకారిణి కోకో వాండెవేపై విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించింది. కేవలం 50 నిమిషాల్లో సెరెనా విలియమ్స్ తన ప్రత్యర్థి లూసిచ్ ను సునాయాసంగా మట్టికరిపించగా, మరో సెమీ ఫెనల్లో వీనస్ విలియమ్స్ పోరాడి గెలిచింది. తొలి సెట్ ను టై బ్రేక్‌లో వీనస్ కోల్పోయినా, ఆ తరువాత రెండు సెట్లను సొంతం చేసుకుని ఫైనల్‌కు చేరింది. రికార్డు టైటిల్స్ పై సెరెనా గురి ఆస్ట్ర్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్లో సెరెనా ఫైనల్ కు చేరడంతో ఆమె ఒక అరుదైన రికార్డుకు చేరువైంది. శనివారం జరిగే పోరులో సెరెనా గెలిస్తే ఓపెన్ శకంలో జర్మనీ క్రీడాకారిణి స్టెఫీగ్రాఫ్ సాధించిన అత్యధిక టైటిల్స్ రికార్డును అధిగమిస్తుంది. ప్రస్తుతం స్టెఫీ గ్రాఫ్-సెరెనాలు 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించి సమంగా ఉన్నారు. దాంతో ఇప్పుడు అందరి కళ్లు సెరెనాపైనే ఉన్నాయి. ఈ రికార్డును సెరెనా అధిగమిస్తుందా?లేదా అనేది ఎల్లుండి తేలిపోనుంది. గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్ టైటిల్స్ ను సాధించిన సెరెనా.. యూఎస్ ఓపెన్‌లో సెమీ ఫైనల్లోనే నిష్క్రమించి ఆ రికార్డును మిస్సయ్యింది. ఇప్పుడు ఆ రికార్డును సవరించాలనే సెరెనా పట్టుదలగా ఉంది. మరొకవైపు ఏడోసారి ఆస్ట్రేలియా ఓపెన్ సాధించాలని సెరెనా భావిస్తుండగా, తొలిసారి ఆ టైటిల్ ను అందుకోవాలని వీనస్ యోచిస్తోంది.