
కేరళ క్రికెట్ లీగ్ (KCL) 2025 సీజన్‌లో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆడనున్న సంగతి తెలిసిందే. గత నెలలో జరిగిన వేలంలో శాంసన్‌ను కొచ్చి బ్లూ టైగర్స్ రూ. 26.80 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది. దీంతో కొచ్చి బ్లూ టైగర్స్ కెప్టెన్‌గా సంజూ ఎంపిక అవుతాడని అంతా భావించారు.
కానీ ఆఖరి నిమిషంలో కొచ్చి ఫ్రాంచైజీ అందరికి షాకిచ్చింది. సంజూను కాదని అతడి అన్నయ్య సాలీ శాంసన్‌ను తమ జట్టు కెప్టెన్‌గా కొచ్చి బ్లూ టైగర్స్ ఫ్రాంచైజీ నియమించింది. తన అన్నయ్యకు డిప్యూటీగా శాంసన్ వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కొచ్చి ఫ్రాంచైజీ వెల్లడించింది.
కాగా కేసీఎల్ వేలంలో సాలీ శాంసన్‌ను రూ.75,000 వేలలకు కొచ్చి కొనుగోలు చేసింది. 34 ఏళ్ల సాలీ శాంసన్ తన కెరీర్ ఆరంభం నుంచి గాయాలతో సతమతమవుతూ వస్తున్నాడు. గత నాలుగేళ్లగా అతడు కేరళ జట్టుకు దూరంగా ఉన్నాడు. కానీ క్లబ్ క్రికెట్‌లో మాత్రం ఆడుతూ వస్తున్నాడు.
కేరళ తరపున ఇప్పటివరకు 6 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. అతడికి బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణించే సత్తా ఉంది. క్లబ్ క్రికెట్‌లో శాంసన్ కెప్టెన్సీ అనుభవం ఉంది. ఈ క్రమంలోనే అతడి కెప్టెన్సీ స్కిల్స్‌పై నమ్మకంతో కొచ్చి తమ జట్టు పగ్గాలను అప్పగించింది.
ఇక కేసీఎల్ తొట్టతొలి సీజన్(2024)లో కొచ్చి బ్లూ టైగర్స్ తీవ్ర నిరాశపరిచింది. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంలో బ్లూ టైగర్స్ నిలిచింది. ఇప్పుడు సంజూ శాంసన్ రాకతో ఎలాగైనా ఈ ఏడాది ఛాంపియన్‌గా నిలవాలని కొచ్చి బ్లూ టైగర్స్ ఉవ్విళ్లూరుతోంది.
కాగా కేరళ క్రికెట్ లీగ్‌లో సంజూ ఆడడం ఇదే తొలిసారి. అన్నయ్య కెప్టెన్సీలో శాంసన్ అరంగేట్రం చేయనున్నాడు. ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ శాంసన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సీజన్‌కు ముందు సీఎస్‌కేకు ట్రేడ్ అవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
చదవండి: అతడి ఆటిట్యూడ్ వల్లే టీమిండియా ఓడిపోయింది: మహ్మద్ కైఫ్