
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 22 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆఖరి వరకు రవీంద్ర జడేజా పోరాడినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. 193 పరుగల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక భారత్ ఓటమి పాలైంది.
ఈ ఓటమిపై తాజాగా భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమికి కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) ఆటిట్యూడ్ కూడా ఓ కారణమని కైఫ్ అభిప్రాయపడ్డాడు. కాగా లార్డ్స్ టెస్టులో గిల్ కాస్త దూకుడుగా వ్యవహరించాడు.
మూడో రోజు ఆట ఆఖరిలో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీని పరుష పదజాలంతో గిల్ దూషించాడు. సమయాన్ని వృథా చేసేందుకు క్రాలీ ప్రయత్నించడంతో గిల్ తన సహనాన్ని కోల్పోయి వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో చాలా మంది మాజీలు గిల్ ప్రవర్తనను తప్పు బట్టారు. తాజాగా ఈ జాబితాలోకి కైఫ్ కూడా చేరాడు.
"జాక్ క్రాలీతో శుబ్‌మన్ గిల్ గొడవ పడడం ఇంగ్లండ్ జట్టులో గెలవాలనే కసిని మరింత పెంచింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ ఘోర ఓటమి తర్వాత వారి బ్యాటింగ్, బౌలింగ్, స్టోక్స్ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఇంగ్లండ్ కూడా కాస్త డిఫెండ్‌లో పడింది.
కాబట్టి ఆ సమయంలో వారిని రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. మన వ్యూహాలను సరిగ్గా అమలు చేసుకుని ముందుకు వెళ్తే సరిపోతుంది. కానీ గిల్ మాత్రం అనవసరంగా క్రాలీతో గొడపడ్డాడు. ఈ సంఘటనను ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యక్తిగతంగా తీసుకున్నాడు.
అందుకే ఎప్పుడూ లేని విధంగా బంతితో నిప్పులు చెరిగాడు. శరీరం సహకరించకపోయినా అద్బుతమైన స్పెల్స్‌ను బౌలింగ్ చేసి తన జట్టుకు విజయాన్ని అందించాడు. గిల్ ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి. అనవసర విషయాల్లో మన ఆటిట్యూడ్ చూపించడం మంచిది కాదు. ఏ విషయాల్లో దూకుడుగా వ్యహరించాలో గిల్ ముందు తెలుసుకోవాలి" అని ఎక్స్‌లో కైఫ్ రాసుకొచ్చాడు.
చదవండి: టూర్లకు తిప్పుతున్నారు.. అరంగేట్రం మాత్రం చేయించరు: భారత మాజీ క్రికెటర్