
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ డబ్ల్యూవీ రామన్ (WV Raman) విమర్శల వర్షం కురిపించాడు. ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఆడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించాడు. నాయకత్వ బృందం ఆలోచన విధానం, నిర్ణయాలు ఎవరికీ ఓ పట్టాన అర్థం కావంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
కాగా టెస్టుల్లో గత కొంతకాలంగా టీమిండియా చేదు ఫలితాలు చవిచూస్తున్న విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన భారత్.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీని 3-1తో చేజార్చుకుంది. తాజాగా ఇంగ్లండ్ (IND vs ENG)లో పర్యటిస్తున్న టీమిండియా ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1తో వెనుకబడి ఉంది.
బెంచ్‌కే పరిమితం
ఇక ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్ టూర్‌లోనూ టీమిండియాతో ఉన్న ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ (Abhimanyu Eswaran). అయితే, ఇంత వరకు అతడికి అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. ఈ బెంగాల్ వెటరన్ ప్లేయర్ దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతూ.. జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ.. తుదిజట్టులో మాత్రం అతడికి స్థానం దక్కడం లేదు.
ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ డబ్ల్యూవీ రామన్ మాట్లాడుతూ.. ‘‘నిజానికి అభిమన్యు ఈశ్వరన్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లకు వరుస అవకాశాలు ఇవ్వాలి. కానీ మేనేజ్‌మెంట్ అలా చేయడం లేదు. అతడి విషయంలో ఏదో ఒక నిర్ణయమైతే తీసుకోవాలి కదా!
టూర్లకు తిప్పుతారంతే.. తుదిజట్టులో చోటు ఉండదు
ఓ క్రికెటర్‌ను వరుసగా టూర్లకు తిప్పుతారు.. కానీ తుదిజట్టులో మాత్రం చోటు ఇవ్వరు.. ఇలా చేయడంలో అర్థం ఉందా అసలు?.. ప్రత్యర్థి జట్టు, పిచ్ స్వభావం.. ఇలా పలు అంశాలను బట్టే తుదిజట్టు కూర్పు ఉంటుందని తెలుసు.. కానీ మరీ ఇలా ప్రతిసారీ అతడిని పక్కనపెట్టడం సరికాదు.
కోచ్‌లు, సెలక్టర్లు బాగా ఆలోచించిన తర్వాతే జట్టును ఎంపిక చేస్తారు. మరి.. కొందరిని మాత్రం తుదిజట్టులో కనీసం ఒక్కసారైనా ఎందుకు ఆడించరు?.. తన గురించి యాజమాన్యం ఏమనుకుంటుందో అని సదరు ఆటగాడు కూడా ఆందోళనకు లోనవుతూ ఉంటాడు.
అతడి సేవలను ఎలా ఉపయోగించుకోవాలి.. జట్టులో ఎలా ఆడించాలన్న అంశాలపై మేనేజ్‌మెంట్‌కు కూడా అవగాహన ఉండదు. మరి అలాంటపుడు అసలు ఎంపిక చేయడం ఎందుకు? అభిమన్యు మంచి ప్లేయర్. అయితే, అతడిని ఆడించాలా వద్దా అన్న అంశంపై మేనేజ్‌మెంట్ ఏదో ఒక నిర్ణయానికి రావాలి.
సెంచరీల వీరుడు
అంతేగాని.. సెలక్ట్ చేసిన ప్రతిసారీ బెంచ్‌కే పరిమితం చేయడం సరికాదు’’ అని యాజమాన్యం తీరును తప్పుబట్టాడు. రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ డబ్ల్యూవీ రామన్ ఈ మేరకు విమర్శలు చేశాడు. కాగా 29 ఏళ్ల అభిమన్యు ఈశ్వరన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇప్పటికి 103 మ్యాచ్‌లు ఆడి 49కు పైగా సగటుతో 7841 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 27 శతకాలు, 31 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.
ఒక్క మ్యాచ్‌కే వేటు వేస్తారా?
అదే విధంగా.. కేవలం ఒక టెస్టులో విఫలమైనంత మాత్రాన సాయి సుదర్శన్‌పై వేటు వేయడం కూడా సరికాదని డబ్ల్యూవీ రామన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టు సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ తొలి ప్రయత్నంలోనే డకౌట్ అయ్యాడు.
రెండో ఇన్నింగ్స్‌లో 30 పరుగులతో ఫర్వాలేదనిపించినా.. రెండో టెస్టు నుంచి అతడిని పక్కనపెట్టారు. మరోవైపు.. వరుస వైఫల్యాల వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్‌కు మాత్రం ఇప్పటికి జరిగిన మూడు టెస్టుల్లోనూ ఆడే అవకాశం ఇచ్చారు.
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు బీసీసీఐ ఎంపిక చేసిన భారత జట్టు
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్.
చదవండి: అతడికి ఇంకొక్క అవకాశం ఇవ్వండి.. నాలుగో టెస్టులో ఆడించండి: కుంబ్లే