గాయమా?.. వేటు వేశారా?.. అదే నిజమైతే: మాజీ క్రికెటర్‌ ఫైర్‌ | Is Sanju Dropped hope its: Ex IND Star On Vaibhav Sooryavanshi Debut | Sakshi
Sakshi News home page

‘అదే నిజమవ్వాలి.. లేదంటే అంతకంటే దారుణం మరొకటి ఉండదు’

Jul 6 2026 3:46 PM | Updated on Jul 6 2026 3:54 PM

Is Sanju Dropped hope its: Ex IND Star On Vaibhav Sooryavanshi Debut

టీమిండియా యాజమాన్యంపై భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒకవేళ సంజూ శాంసన్‌ను గనుక కావాలని తప్పించి ఉంటే.. అంతకంటే దారుణం మరొకటి ఉండదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో భారత్‌ విజేతగా నిలవడంలో సంజూ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ఈవెంట్‌ ఆరంభంలో తుదిజట్టులో చోటు సంపాదించుకోలేకపోయిన సంజూ.. ఆ తర్వాత వచ్చి నాకౌట్‌ మ్యాచ్‌లో దుమ్ములేపాడు. 97*, 89, 89 పరుగులతో రాణించి... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీ’గా నిలిచాడు. ఐపీఎల్‌-2026లోనూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున సత్తా చాటాడు.

అయితే, ఆ తర్వాత ఐర్లాండ్‌ పర్యటనలో మాత్రం సంజూ దారుణంగా విఫలమయ్యాడు. రెండు మ్యాచ్‌లలో వరుసగా 5, 0 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ ఒక్క పరుగే చేసి అవుటయ్యాడు. అదే సమయంలో వైభవ్‌ సూర్యవంశీ అరంగేట్రం గురించి డిమాండ్లు వెల్లువెత్తాయి.

ఓవైపు గత మూడు మ్యాచ్‌లలో సంజూ వైఫల్యాలు.. మరోవైపు వైభవ్‌ విషయంలో ఒత్తిడి.. ఇలాంటి తరుణంలో ఇంగ్లండ్‌తో రెండో టీ20 నుంచి సంజూను తప్పించి.. వైభవ్‌ను అరంగేట్రం చేయించింది యాజమాన్యం. అయితే, సంజూ మాదిరే విఫలమైన వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ను మాత్రం కొనసాగించింది.

ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ ఘాటుగా స్పందించాడు. ‘‘వైభవ్‌ను టీమిండియా జెర్సీలో చూడటం సంతోషంగా అనిపించింది. కానీ సంజూ శాంసన్‌ సంగతేంటి? అతడిపై వేటు వేశారా? మీరు నాతో జోక్‌ చేయడం లేదు కదా!

నేనైతే ఇది జోక్‌ కాదనే అనుకుంటున్నా. బహుశా సంజూ గాయపడి ఉంటాడని నా సందేహం. ఇదే నిజమవ్వాలని కోరుకుంటున్నా. అలా కాకుండా అతడిని తప్పించారంటే మాత్రం ఇంతకంటే విచిత్రమైన, దారుణమైన సెలక్షన్‌ మరొకటి ఉండదు.

ఎందుకంటే వైభవ్‌ సూర్యవంశీని తప్పకుండా తుదిజట్టులో ఆడించాలంటే.. సంజూ మూడో స్థానంలోనైనా సులువుగా బ్యాటింగ్‌ చేసేవాడు’’ అని సంజయ్‌ మంజ్రేకర్‌ ‘ఎక్స్‌’ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement