సంజూకు మళ్లీ అన్యాయం..? బీసీసీఐపై ఫ్యాన్స్‌ ఫైర్‌! | Is Sanju Samson Dropped From India T20I Squad For Zimbabwe? BCCIs Latest Decision Sparks Massive Speculation | Sakshi
Sakshi News home page

IND vs ZIM: సంజూకు మళ్లీ అన్యాయం..? బీసీసీఐపై ఫ్యాన్స్‌ ఫైర్‌!

Jul 6 2026 9:13 PM | Updated on Jul 7 2026 11:15 AM

Samson Dropped? BCCIs Latest Decision Sparks Massive Speculation

టీమిండియా స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ అంతర్జాతీయ టీ20 కెరీర్ మ‌రోసారి సందిగ్ధంలో ప‌డింది. మొన్న ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20కి తుది జట్టులో కోల్పోయిన సంజాకు ఇప్పుడు మరో భారీ షాక్ తగిలింది. ఈ నెలఖారులో జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. 

అయితే ఈ జట్టులో  జట్టులో శాంసన్‌కు చోటు దక్కలేదు. అతడి స్ధానంలో పంజాబ్ వికెట్ కీపర్ బ్యాటర్‌ ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను తొలిసారి నేషనల్ టీమ్‌కు ఎంపిక చేశారు. అదేవిధంగా యధావిధిగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని జట్టులో కొనసాగించారు. జింబాబ్వే పర్యటనలో అభిషేక్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్‌ను వైభవ్ ఆరంభించనున్నాడు.

వేటునా? విశ్రాంతా?
సాధారణంగా జింబాబ్వే లాంటి పర్యటనలను సీనియర్లకు విశ్రాంతినిచ్చి, యువ ఆట‌గాళ్ల‌ను ప‌రీక్షించేందుకు అవ‌కాశమిస్తారు. కానీ ఈసారి సీనియర్ బ్యాటర్లలో కేవలం సంజూ శాంసన్‌ను మాత్ర‌మే ప‌క్క‌న పెట్ట‌డం ప‌లు అనుమానాల‌కు తావ‌నిస్తోంది. అత‌డిని కావాల‌నే త‌ప్పించారా?  లేదా రెస్ట్‌ ఇచ్చారా? అన్న‌ది ఇంకా స్ప‌ష్ట‌తలేదు.

అయితే సంజూ ప్ర‌స్తుతం కేవ‌లం టీ20 ఫార్మాట్‌లో మాత్ర‌మే కొన‌సాగుతున్నాడు. ఇంగ్లండ్‌, జింబాబ్వే టూర్‌ల త‌ర్వాత భార‌త్‌కు పెద్ద‌గా టీ20 సిరీస్‌లు లేవు. మ‌ళ్లీ సెప్టెంబ‌ర్‌లో ఆసియాక‌ప్ గేమ్స్‌లో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది. అంటే దాదాపు రెండు నెల‌ల విరామం ల‌భిస్తోంది. అలాంటిప్పుడు కేవలం ఒక్క ఫార్మాట్ ఆడే సంజూకు ‘విశ్రాంతి’ ఇవ్వాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి

సంజూకు రెస్ట్‌ కాదని, కావాల‌నే ప‌క్క‌న పెట్టార‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ హీరో అయిన సంజూకు మ‌రోసారి అన్యాయం జ‌రిగింద‌ని అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌తో పాటు ఐపీఎల్‌లో దుమ్ములేపిన సంజూ.. యూకే టూర్‌లో మాత్రం విఫ‌ల‌మ‌య్యాడు. 

ఐర్లాండ్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల‌లోనూ సింగిల్ డిజిట్ స్కోర్ల‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. ఆ త‌ర్వాత ఇంగ్లండ్‌తో జ‌రిగిన తొలి టీ20లో కేవ‌లం ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. దీంతో రెండో టీ20కు అత‌డిని త‌ప్పించి చిచ్చ‌ర పిడుగు వైభ‌వ్ సూర్య‌వంశీ అవ‌కాశ‌మిచ్చారు. ఇప్పుడు ఏకంగా ప్ర‌ధాన జ‌ట్టులోనే అత‌డికి చోటు ద‌క్క‌క‌పోవ‌డం తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన జట్టులో మాత్రం సంజూ సభ్యునిగా ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement