సహజ, రష్మిక శుభారంభం | Sahaja Yamalapalli Srivalli Rashmika off to a good start in the W75 womens tournament | Sakshi
Sakshi News home page

సహజ, రష్మిక శుభారంభం

Jan 29 2025 4:18 AM | Updated on Jan 29 2025 4:18 AM

Sahaja Yamalapalli Srivalli Rashmika off to a good start in the W75 womens tournament

పుణే: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) డబ్ల్యూ75 మహిళల టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్, తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి, భారతమూడో ర్యాంకర్, తెలంగాణకే చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మిక శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో సహజ 6–7 (4/7), 6–1, 6–3తో నహో సాటో (జపాన్‌)పై... శ్రీవల్లి రష్మిక 6–1, 6–2తో అలానా స్మిత్‌ (అమెరికా)పై గెలిచారు. 

క్వాలిఫయర్‌ నహో సాటోతో 2 గంటల 35 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సహజ తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయింది. తొలి సెట్‌ చేజార్చుకున్నా ఆందోళన చెందకుండా సంయమనంతో ఆడిన సహజ పుంజుకుంది. ఆ తర్వాత కేవలం నాలుగు గేమ్‌లు కోల్పోయి రెండు సెట్‌లు నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకుంది. అలానా స్మిత్‌తో 80 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో రష్మిక కేవలం మూడు గేమ్‌లు మాత్రమే చేజార్చుకుంది. 

భారత్‌కే చెందిన వైదేహి, వైష్ణవి, అంకిత రైనా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. వైదేహి 3–6, 3–6తో తాతియానా ప్రొజోరోవా (రష్యా) చేతిలో, వైష్ణవి 3–6, 4–6తో ఫాన్‌గ్రాన్‌ టియాన్‌ (చైనా) చేతిలో, అంకిత రైనా 7–6 (8/6), 4–6, 3–6తో ఎలీనా ప్రిదాన్కినా (రష్యా) చేతిలో ఓడిపోయారు. డబుల్స్‌ తొలి రౌండ్‌లో రష్మిక–వైదేహి ద్వయం 2–6, 1–6తో మరియా కొజిరెవా–ఇరీనా శ్యామనోవిచ్‌ (రష్యా) జోడీ చేతిలో ఓడిపోయింది.
  
ప్రాంజలకు నిరాశ 
హైదరాబాద్‌కే చెందిన మరో ప్లేయర్‌ యడ్లపల్లి ప్రాంజలకు నిరాశ ఎదురైంది. క్వాలిఫయింగ్‌ సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రాంజల 4–6, 4–6తో నహో సాటో (జపాన్‌) చేతిలో ఓడిపోయింది. డబుల్స్‌ మెయిన్‌ ‘డ్రా’ తొలి రౌండ్‌లో ప్రాంజల–జీల్‌ దేశాయ్‌ (భారత్‌) ద్వయం 2–6, 4–6తో డయానా మర్సిన్‌కెవికా (లాత్వియా)–నహో సాటో (జపాన్‌) జంట చేతిలో పరాజయం పాలైంది. 

2019లో కెరీర్‌ బెస్ట్‌ 265వ ర్యాంక్‌కు చేరుకున్న 25 ఏళ్ల ప్రాంజల ఆ తర్వాత గాయాల బారిన పడింది. గత ఏడాది ఒక్క టోర్నీలోనూ ఆడని ప్రాంజల ఈ ఏడాది గతవారం న్యూఢిల్లీలో జరిగిన ఐటీఎఫ్‌ డబ్ల్యూ50 టోర్నీతో పునరాగమనం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement